● నాణ్యతకు, రుచికి కేరాఫ్ తాండ్ర ● వేసవి వచ్చిందంటే గ్రామంలో సందడే సందడి ● అనాదిగా మామిడి తాండ్ర వేస్తున్న గ్రామస్తులు ● 450 కుటుంబాలకు జీవనాధారం
భీమాళి గ్రామంలో మామిడి తాండ్ర పోస్తున్న కార్మికులు
ప్రభుత్వం సహకరించ లేదు
తాత ముత్తాతల నుంచి తాండ్ర తయారు చేస్తున్నాం. మా ఖ్యాతి దేశ విదేశాల్లో మారుమోగుతోంది.ఇంతటి విలువైన తాండ్ర తయారీకి ప్రభుత్వం కనీసం సహకరించడం లేదు. గ్రామంలో రెండు సంవత్సరాల క్రితం రూ 25లక్షలతో ఏర్పాటు చేసిన మినీ సోలార్ కోల్డ్ స్టోరేజీలు మూలకు చేరాయి. రాయితీలు లేవు. బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. ఇప్పటికై నా ప్రభుత్వ పెద్దలు స్పందించాలి.
– గొర్లె సత్యం, శ్రీపరనదేశమ్మతల్లి మామిడి ఉత్పత్తిదారుల సంఘం అద్యక్షుడు, భీమాళి
తాండ్ర పోసేందుకు కూలీలు కరువు
ఈ పని చేసేందుకు అధికంగా కూలీలు అవసరం ఉంది. కాగా కూలీలు దొరకకపోవడంతో కుటుంబసభ్యులం చిన్నాపెద్దా తేడా లేకుండా పని చేస్తున్నాం. అరకు, అనంతగిరి, ఒడిశా ప్రాంతాల నుంచి గిరిజనలు పనులకు ఈ ఏడాది వచ్చారు.వారికి రోజుకు రూ 300వందల నుంచి రూ.4వందల వరకు కూలీ చెల్లిస్తున్నాం.
– బొబ్బిలి చిన్నోడు,
తాండ్ర తయారీ దారు, భీమాళి
లక్కవరపుకోట: వేసవి వచ్చిందంటే ఆ గ్రామంలో సందడే సందడి. ప్రతి ఇంటిలో చిన్నారుల నుంచి ముసలివారి వరకు ఎండలో కష్టపడుతూ నోరూరించే మామిడి తాండ్ర తయారీలో నిమగ్నమై ఉంటారు. రాష్ట్రంలోని పలుచోట్లతో పాటు జిల్లాలో కూడా చాలాచోట్ల మామిడితాండ్ర తయారు చేస్తున్నారు. అయినా లక్కవరపుకోట మండలంలోని భీమాళి గ్రామంలో తయారు చేసిన తాండ్ర రుచే వేరు. నాణ్యతకు, రుచికి మారుపేరుగా భీమాళి తాండ్ర ఉంటుందని దేశవిదేశాలకు చెందిన తాండ్ర ప్రియలు చెబుతుంటారు. ఈ గ్రామంలో సుమారు 450 కుటుంబాలు ఉంటాయి. వారంతా ప్రతి ఏడాదీ తాండ్ర తయారు చేస్తారు. అనాదిగా ఇదే వృత్తిపై ఆధారపడి తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. దేశ, విదేశాల్లో ఉన్న వారు భీమాళి తాండ్ర తెప్పించుకుని మరీ తింటారు. ప్రజా ప్రతినిధులు,ఉన్నత స్థాయి అధికారుల వద్ద తమ పనులు ఇట్టే అవాలంటే భీమాళి మామిడి తాండ్ర బహుమతిగా ఇస్తే చాలు ఠక్కున పనిఅయిపోయినట్లే అంటారు చాలామంది. అంతటి ప్రత్యేకత ఉంది భీమాళి తాండ్రకు. అయితే ఈ తాండ్ర తయారు చేసిన వారి పరిస్థితి మాత్రం అంతంత మాత్రంగానే వుంది.
గిట్టుబాటు ధర లేక కష్టాలు
వేసవి మండుటెండల్లో తయారు చేసిన మామిడి తాండ్రకు గిట్టుబాటు ధరలేక ఉత్పత్తిదారులకు కష్టాలు తప్పడం లేదు. గత ఏడాదితో పోల్చితే వంద కేజీల పంచదార ధర గణనీయంగా పెరిగిపోయింది. కష్టపడి తయారు చేసిన మామిడి తాండ్రను నిల్వ చేసుకునేందుకు శీతలీకరణ గిడ్డంగులు లేకపోవడంతో మంచి ధర పలికేవరకు నిల్వ ఉంచలేకపోతున్నారు. దీంతో తయారు చేసిన కొద్ది రోజులకే అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించింది. కోల్డ్‌స్టోరేజ్ నిర్మించాలని ఎన్నిమార్లు కోరినా ఫలితం లేకుండా పోయిందని గ్రామస్తులు వాపోతున్నారు. దీనికి తోడు తాండ్ర వేసేందుకు వచ్చే కూలీల వేతనాలు గణనీయంగా పెరిగిపోయాయి. తాండ్ర మాత్రం హోల్‌సేల్‌లో కేజీ రూ.100 నుంచి రూ.120 మాత్రమే అమ్ముతున్నారు.
ప్రభుత్వం సహకరించడం లేదు
దేశవిదేశాల్లో పేరు గాంచిన భీమాళి తాండ్ర తయారీ దారులకు మాత్రం ప్రభుత్వం కనీసం సహకరించడం లేదని ఉత్పత్తిదారులు వాపోతున్నారు. ఏడాది పొడవునా తాండ్రను నిల్వ ఉంచేందుకు కోల్డ్ స్టోరేజ్ లేకపోవడంతో తయారు చేసిన నెలలోనే అమ్మకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. తయారీకి అవసరమైన బ్యాంకు రుణాలు సైతం ఇవ్వడం లేదని ఆందోళన చెందుతున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం సాయంతో గ్రామంలో సుమారు రూ.25 లక్షలతో ఏర్పాటు చేసిన సోలార్ మినీ కోల్డ్ స్టోరేజీలు మూలకు చేరాయి. ఏర్పాటు చేశాక ఒక్క రోజుకూడా ఈ స్టోరేజీలు పనిచేయలేదని ఉత్పత్తి దారులు అంటున్నారు.
అమ్మకపు పన్ను రద్దు చేయాలి
భీమాళి గ్రామంలో తాండ్ర తయారీ కుటీర పరిశ్రమగా నడుపుతున్నారు.రైతులు తయారు చేసిన తాండ్ర పై అమ్మకపు పన్ను ఉండడంతో కొనుగోలు దారులు గ్రామాలకు రావడంలేదు. దీంతో కొనుగోలు దారు ల వద్దకు రైతులే తీసుకెళ్లడంతో వారు అడిగిన ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తోందంటూ రైతులు గ గ్గోలు పెడుతున్నారు.ఇప్పటికై నా జిల్లాకు, రాష్ట్రానికి ఇంతపేరు తీసుకొచ్చిన భీమాళి మామిడి తాండ్ర రైతులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుని సౌకర్యాలు కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.


