● స్మార్ట్‌ఫోన్ మత్తు, చెడు స్నేహాలతో చిత్తవుతున్న యువత ● విజ్ఞానం పెరగాల్సింది పోయి.. విధ్వంసం వైపు పయనం
చట్టాలపై అవగాహన తెస్తున్నాం.. కన్నవారు సహకరించాలి
పార్వతీపురం రూరల్: చదువు నేర్చుకుని సంస్కారంతో సమాజంలో ఉన్నత స్థానానికి ఎదగాల్సిన విద్యార్థులు, క్షణికావేశంలో నేరాల బాట పడుతున్నారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల పరిధిలో ఇటీవల జరిగిన వరుస హింసాత్మక సంఘటనలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. చెడు స్నేహాలు, స్మార్ట్‌ఫోన్‌ల అతివాడకం, తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం కారణంగా పసిప్రాయంలోనే కొందరు కత్తులు దూస్తూ జైలు పాలువుతుండడం సామాజిక శ్రేయస్సును ప్రశ్నిస్తోంది.
పర్యవేక్షణ కరువై..చరవాణి చెరలో..
ఈ విపరీత ధోరణులకు ప్రధాన కారణాలను విశ్లేషిస్తే, ఉమ్మడి కుటుంబాల అదృశ్యం, తల్లిదండ్రుల తీరికలేని జీవితాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత కాలంలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉండడంతో పిల్లలపై నిరంతర పర్యవేక్షణ కరువవుతోంది. బడికి, కళాశాలలకు వెళ్లే పిల్లలు అక్కడ ఎలా ఉంటున్నారు? ఎవరితో స్నేహం చేస్తున్నారనే విషయాలను గమనించే సమయం తల్లిదండ్రులకు దొరకడం లేదు. దీనికి తోడు, చిన్న వయసులోనే పిల్లల చేతికి వస్తున్న స్మార్ట్‌ఫోన్ మరింత శాపంగా మారుతోంది. జ్ఞానార్జన కోసం కాకుండా, రకరకాల అవాంఛనీయ యాప్‌లు, హింసాత్మక కంటెంట్ వైపు ఆకర్షితులవుతూ విద్యార్థులు నేర ప్రవృత్తికి లోనవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రతి ఏటా విద్యార్థుల మధ్య అనేక గొడవలు జరుగుతుండగా, వాటిలో కొన్ని పదుల సంఖ్యలో మాత్రమే పోలీస్ స్టేషన్ల వరకు చేరి కౌన్సెలింగ్‌తో ముగుస్తున్నాయి.
విస్మయానికి గురిచేస్తున్న వరుస
ఘోరాలు
రాజాంలో పదో తరగతి పాసై, ఉజ్వల భవిష్యత్తు కోసం కళాశాలకు వెళ్లాల్సిన 16 ఏళ్ల బాలుడు, చెడు స్నేహాల ప్రభావంతో కన్నతల్లినే హత్య చేసిన ఉదంతం సభ్య సమాజాన్ని విస్మయానికి గురిచేసింది. అలాగే బొబ్బిలి పట్టణంలో ఇద్దరు బాలుర మధ్య జరిగిన చిన్నపాటి వివాదం కాస్తా భౌతిక దాడిగా మారింది. ఒక బాలుడు బలంగా కొట్టడంతో మరో బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. అలాగే పార్వతీపురంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో జరిగిన డిగ్రీ విద్యార్థుల వీడ్కోలు (ఫేర్‌వెల్) వేడుకల్లో కొందరు విద్యార్థులు పరిమితులు దాటి ప్రవర్తించారు. మద్యం తాగి ఘర్షణకు దిగడమే కాకుండా, వారిని వారించేందుకు వచ్చిన అధ్యాపకుడిపైనే భౌతిక దాడికి తెగబడ్డారు.
విద్యార్థి దశ ఎంతో విలువైంది. ఈ వయసులో క్షణికావేశానికి లోనైనా, చెడు అలవాట్ల వైపు ఆకర్షితులైనా జీవితాంతం కుంగిపోవాల్సి వస్తుంది. మత్తు పదార్థాల వల్ల జరిగే అనర్థాలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే భవిష్యత్తులో చట్టపరంగా ఎదురయ్యే తీవ్ర ఇబ్బందులపై పోలీస్ శాఖ తరఫున విద్యాసంస్థల్లో నిరంతరం అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. తప్పు చేస్తే చట్టం ఎవరినీ వదిలిపెట్టదు. అయితే, కేవలం పోలీసుల చర్యలు, కౌన్సెలింగ్‌ల వల్లే పూర్తి మార్పు రాదు. దీనికి తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరం. ఉపాధి, పనుల ఒత్తిడి ఎంత ఉన్నప్పటికీ.. కన్నవారు తమ పిల్లల నడవడికపై నిరంతరం ఒక కన్నేసి ఉంచాలి. వారు ఎవరితో తిరుగుతున్నారు, ఫోన్లలో ఏం చూస్తున్నారో గమనిస్తూ ఉండాలి. అప్పుడే ఇలాంటి ఘోరాలను ప్రాథమిక దశలోనే అడ్డుకోగలం.
– ఎస్వీ మాధవరెడ్డి, ఎస్పీ పార్వతీపురం మన్యం


