● జూన్ 30 వరకు ఆన్‌లైన్‌లో గడువు
విజయనగరం గంటస్తంభం: జిల్లాలోని 3 ప్రభుత్వ, 25 ప్రైవేట్ ఐటీఐలలో ఆగస్టు–2026 సెషన్‌కు గాను మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైనట్లు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్ బి.వి.గిరి ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్ధులు జూన్ 30వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వెల్డర్, ప్లంబర్ కోర్సులకు 8వతరగతి, మిగిలిన ట్రేడ్‌లకు 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక వచ్చే యూనిక్ నంబర్ ప్రింటవుట్, ఒరిజినల్ సర్టిఫికెట్లతో జూలై 2వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సమీప ఐటీఐ కళాశాలలో ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసుకోవాలని స్పష్టం చేశారు. వెరిఫికేషన్ చేయించుకున్న వారే కౌన్సెలింగ్‌కు అర్హులవుతారని, మిగిలిన వారికి ర్యాంకులు కేటాయించరని తెలిపారు. అభ్యర్ధులు తమ ఆధార్ అనుసంధానమైన మొబైల్ నంబర్‌తోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, అభ్యర్థి పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ వివరాలు 10వ తరగతి సర్టిఫికెట్, ఆధార్‌కార్డులో ఒకేవిధంగా ఉండాలని సూచించారు. ఇతర వివరాలకు ఫోన్ 6300768405, 9703179119, 9603029117 నంబర్లను సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.
23 నుంచి శాప్ లీగ్ పోటీలు
పార్వతీపురం: పార్వతీపురంలోని శ్రీవెంకటేశ్వర కళాశాల మైదానంలో ఈనెల 23న శాప్ లీగ్ జిల్లాస్థాయి అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్ ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి డా. కె. శ్రీధర్‌రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 23న ఉదయం 9గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని అండర్–16, అండర్–17, అండర్–20 విభాగాల్లో అథ్లెటిక్స్, అండర్–17లో వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ఉంటాయన్నారు. జిల్లా నివాసులైన క్రీడాకారులు ఆధార్, వయస్సు ధృవీకరణ పత్రంతో హాజరుకావాలని సూచించారు. ముందుగా శాప్ పోర్టల్‌లో నమోదు చేసుకున్నవారికే అవకాశం ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ 9866805716, 7396423490 నంబర్లను సంప్రదించాలని ప్రకటనలో పేర్కొన్నారు.
కెమిస్ట్– డ్రగ్గిస్ట్‌ల సమస్యలు పరిష్కరించాలి
సీతానగరం: కెమిస్ట్–డ్రగ్గిస్ట్‌లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ రెవెన్యూ, పోలీసు మండల కార్యాలయాల్లో అధికారులకు మంగళవారం వినతి పత్రాలను అందజేశారు. ఈ మేరకు మందుల షాపుల నిర్వాహకులు మాట్లాడుతూ దీర్ఘకాలంగా మందులషాపుల్లో మందులు అత్యవసర పరిస్థితుల్లో విక్రయాలు నిర్వహించే సమయంలో ధరల నిర్ణయంలో పలుసమస్యలు ఎదుర్కొంటున్నామన్నారు. అలాగే ప్రభుత్వం తమసమస్యలు పరిష్కరిస్తామని ప్రకటించినా ఇంతవరకూ నెరవేర్చకపోవడంతో షాపుల్లో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఈనేపథ్యంలో జాతీయ కెమిస్ట్ యూనియన్ పిలుపు మేరకు సమస్యలతో కూడిన వినతి పత్రాలను తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ సహాయకుడు రామారావుకు, పోలీస్టేషన్‌లో ఏఎస్సై లక్ష్మణరావుకు అందజేశారు. కార్యక్రమంలో శ్రీసాయిజ్యోతి, శంకర్ మెడికల్, భారతి మెడికల్, జై శంకర్‌మెడికల్, సాయి జశ్వంత్ మెడికల్ షాపుల నిర్వాహకులు పాల్గొన్నారు.
ఆరోగ్య సమస్యలను గుర్తించి నిర్ధారణ చేయాలి
బలిజిపేట: ఆరోగ్య సమస్యలను సకాలంలో గుర్తించి నిర్ధారణ చేయాలని ఎన్సీడీ పీఓ జగన్‌మోహన్ అన్నారు. ఈ మేరకు బలిజిపేట, అరసాడ పీహెచ్‌సీలను ఆయన మంగళవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వైద్యాధికారులు, సిబ్బందికి సూచనలు అందించారు. ఆరోగ్యపరమైన సమస్యలను సకాలంలో గుర్తించి నిర్ధారణ చేయాలని తద్వారా వెంటనే తగు చికిత్స అందిస్తే వ్యాధి తీవ్రత కాకుండా నివారించవచ్చని ఆయన తెలిపారు. పీహెచ్‌సీలో గర్భిణులు, రోగులతో మాట్లాడి వైద్య సేవలు ఏవిధంగా అందుతున్నాయో తెలుసుకున్నారు. ఓపీ, ఈహెచ్‌ఆర్, ల్యాబ్ పరీక్షలు, చికిత్స వివరాలను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ఆరోగ్య సమస్యలను సకాలంలో స్పష్టంగా తెలుసుకోవాలని సూచించారు. దీర్ఘకాలిక వ్యాధులకు సకాలంలో మందులు అందించాలని చెప్పారు. ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరుపై ప్రతి వారం సెక్రటేరియట్స్ వారీగా నివేదికలను పరిశీలించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


