చీపురుపల్లి: రిక్షా తొక్కుకుంటూ చెమటోడ్చి రూపాయి రూపాయి కూడగట్టి సొంత గూడు నిర్మించుకున్నాం. దశాబ్దాల తరబడి ఇక్కడే నివాసం ఉంటున్నాం. రైల్వే లైన్ కోసం మీ ఇల్లు కూల్చేస్తాం అంటూ అకస్మాత్తుగా అధికారులు మా వెంట పడితే ఏం చేయాలో అర్థం కావడం లేదంటూ చీపురుపల్లి మేజర్ పంచాయతీలోని రిక్షాకాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే మూడవ లైన్ సర్వేకు మంగళవారం వెళ్లిన రెవెన్యూ అధికారులను కాలనీ వాసులు అడ్డుకున్నారు. అనంతరం తహసీల్దార్ డి.ధర్మరాజు కాలనీ వాసులతో మాట్లాడి న్యాయం చేస్తామని చెప్పారు. మూడవ రైల్వే లైన్ కోసం ఇటీవల జరిపిన సర్వేలో రిక్షా కాలనీలో సుమారు 40 గృహాలు తొలగించాల్సి వస్తుందని సర్వే అధికారులు గతంలో ధ్రువీకరించారు. దీనికి సంబంధించి రైల్వే అధికారులు సర్వే జరిపి ఇళ్లను గుర్తించడంతోపాటు మార్కింగ్ కూడా ఇచ్చారు. దీంతో ఈ నెల 15న రిక్షాకాలనీ వాసులు తహసీల్దార్‌ను కలిసి తమ ఇళ్లను కోల్పోయేందుకు సిద్ధంగా లేమని వినతిపత్రం అందజేశారు. దీంతో మరోసారి మంగళవారం రిక్షా కాలనీలో సర్వే నిర్వహించగా రిక్షాకాలనీవాసులు అడ్డుకున్నారు. సర్వేల ప్రకారం ఇళ్లను కోల్పోతున్న బాధితులకు ప్రభుత్వం అదనంగా ఇళ్లతో పాటు నష్టపరిహారాన్ని కూడా అందజేస్తామంటూ అధికారులు చెబుతున్నప్పటికీ కాలనీవాసులు సంతృప్తి చెందలేదు. ప్రభుత్వం ఎంత నష్టపరిహారం చెల్లిస్తున్నా తమ కాలనీని విడదీసి మా కుటుంబాలను వేరు చేయకండి అంటూ కాలనీవాసులు స్థానిక తహసీల్దార్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.దీనికి తహసీల్దార్ ధర్మరాజు మాట్లాడుతూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన మేరకు ప్రస్తుతం తమ సిబ్బంది సర్వే జరుపుతున్నారని కాలనీవాసుల డిమాండ్లను ప్రభుత్వానికి నివేదించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాలనీ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.
రిక్షా కాలనీ వాసుల ఆవేదన


