పార్వతీపురం: గిరిజన సమాజాల అభ్యున్నతికి, గిరిజన ఉత్పత్తుల గ్లోబల్ బ్రాండింగ్‌కు ఆధునిక సాంకేతికతను జోడించడమే జన జాతీయ గరీమా ఉత్సవ్ –2026 లక్ష్యమని ఐటీడీఏ ఏపీఓ పి.మురళీధర్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం గిరిమిత్ర హాల్‌లో గిరిజన సంక్షేమశాఖ, ఐటీడీఏ సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో గిరిజన ఉత్పత్తుల బ్రాండింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఏఐ వినియోగంపై అవగాహన కల్పించారు. చాట్‌జీపీటీ సహాయంతో గిరిజన ఉత్పత్తులకు ఆకర్షణీయమైన లేబుల్స్, పోస్టర్లు, కాలీగ్రఫీ డిజైన్లు రూపొందించే విధానంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. జీడిపప్పు, పసుపు, మిల్లెట్స్ వంటి ఉత్పత్తులను సభ్యులు ప్రదర్శించారు. ఏఐ సాంకేతికతతో తక్కువ ఖర్చులోనే ఆధునిక బ్రాండింగ్ సాధ్యమవుతుందని పలువురు సభ్యులు పేర్కొన్నారు. కార్యక్రమంలో వెలుగు డీపీఎం శ్రీరామ్, ట్రైఫెడ్ డీఎం, ఎస్‌జీ చల్వాడీ, వీడీవీకే అసోసియేట్ సాయిరాం తదితరులు పాల్గొన్నారు.


