పార్వతీపురం: జిల్లాలోని 16 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించే ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డు సప్లిమెంటరీ పరీక్షలను సమర్ధవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా చర్యలు తీసుకో వాలని సీఎస్, డీఓలకు సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఫలి తాలు సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ ఏడాది పదోతరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో కనీసం 7,500 మందిని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఐఐటీ, నీట్ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు జిల్లాలో ప్రత్యేక శిక్షణ అందిస్తామని తెలిపారు. ప్రతిభ గల విద్యార్థులను గుర్తించి జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందేలా ప్రోత్సహిస్తామన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు పెంచడంతో పాటు, ఇంటర్ పూర్తిచేసిన ఏ విద్యార్థి కూడా డ్రాపౌట్ కాకుండా చూడాలని సూచించారు. సమావేశంలో డీఐఈఓ వై.నాగేశ్వరరావుతో పాటు అధికారులు ఎస్.రమణ, హరిగోపాల్,ఆకుల రాజు పాల్గొన్నారు.


