పార్వతీపురం: మన్యం జిల్లాలో రాబోయే ఐదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి సోమవారం తెలిపారు. రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీ) విభాగం విడుదల చేసిన తాజా వాతావరణ నివేదిక ప్రకారం జిల్లాలోని 15 మండలాల్లో ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. అన్ని మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొన్ని మండలాల్లో ఉష్ణోగ్రత 41 నుంచి 54 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచించారు. డీహైడ్రేషన్‌కు గురికాకుండా తరుచూ తగినంత నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలని సూచించారు. వడదెబ్బ నివారణకు గొడుగు లేదా టోపీ వినియోగించాలని సూచించారు.


