పార్వతీపురం రూరల్: ఆరోగ్యకరమైన ఆహార నియమాలు, జీవనశైలి మార్పులతో రక్తపోటును (బీపీ) అధిగమించవచ్చని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) ఎస్.భాస్కరరావు తెలిపారు. ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా పార్వతీపు రం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటుచేసిన వైద్యశిబిరాన్ని సోమవారం సాయంత్రం జిల్లా ఎన్‌సీడీ అధికారి టి.జగన్‌మోహనరావుతో కలిసి ఆయన పరిశీలించారు. అక్కడ పోలీస్ ఉద్యోగులకు బీపీ, సుగర్, బీఎమ్‌ఐ పరీక్షించారు. అనంతరం డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. మానసిక ఒత్తిడి వల్ల బీపీ పెరిగి మెదడు, గుండె, కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. మెడ నరాలు లాగడం, కళ్లు తిరగడం, తలపోటు, ఒళ్లంతా చెమటలు పట్టడం బీపీ లక్షణాలని.. బాధితులు ఆహారంలో ఉప్పు, మసాలాలు, నిల్వ పచ్చళ్లు తగ్గించి, వ్యాయామం అలవర్చుకోవాలని సూచించారు. డీఎంఓ సూర్యనారాయణ, రవిచంద్ర,ఎల్.శ్రీనివాసరావు, ఆరోగ్య పర్యవేక్షకులు పుష్ప, జయగౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.


