పార్వతీపురం రూరల్: కుటుంబ బాధ్యతలు విస్మరించి, తనను, పిల్లలను వేధిస్తున్నాడంటూ పార్వతీ పురంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు కానిస్టేబు ల్ కొండగొర్రె నాగభూషణరావుపై ఆయన భార్య నిర్మల కలెక్టర్‌కు సోమవారం ఫిర్యాదు చేసింది. దీనిపై బాధితురాలు తెలిపిన కథనం ప్రకారం.. సీతంపేట మండలంలోని కడగండికి చెందిన నాగభూషణరావుతో ఆమెకు 2015లో వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం వారు సీతంపేటలోని అద్దె ఇంట్లో ఉంటున్నారు. కొంతకాలంగా తన భర్త మరో మహిళతో పరిచయాలు పెట్టుకుని, ఆమెకు ఆన్‌లైన్ ద్వారా డబ్బులు పంపుతున్నాడని..దీనిపై నిలదీసినందుకు తనను రక్తం వచ్చేలా కొట్టాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. గత 26 నెలలుగా జీతభత్యాలు ఇవ్వకుండా, కనీస నిత్యావసరాలు కొనివ్వకుండా పిల్లలను, తనను పస్తులుంచుతూ మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నట్లు పేర్కొంది. గ్రామ పెద్దలతో కలిసి వెళ్లినా ఇంట్లోకి రానివ్వకుండా దుర్భాషలాడి, దాడికి తెగబడ్డాడని వాపోయింది. గతంలో సీతంపేట పోలీస్‌స్టేషన్‌లో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని, పిల్లల పోషణకు భర్త నుంచి జీవనభృతి ఇప్పించాలని, తిరిగి కాపురం చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను వేడుకుంది.


