పార్వతీపురం రూరల్: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో సోమవారం ఓ వ్యాపారిపై తుపాకీ గురిపెట్టి డబ్బులు దోచుకున్న ఘటన కలకలం రేపింది. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమరాడ మండలం విక్రంపురం గ్రామానికి చెందిన చప్పటి పోలిరాజు పార్వతీపు రం పట్టణంలోని దేవాంగుల వీధిలో ఉన్న ఓ కట్ పీస్ సెంటర్‌లో పనిచేస్తున్నాడు. దుకాణానికి సంబంధించిన వ్యాపార వసూళ్ల నిమిత్తం ఆయన ప్రతి వారం వలే సోమవారం పొరుగు రాష్ట్రమైన ఒడిశా వెళ్లారు. అక్కడ వసూళ్లు ముగించుకుని తిరిగి వస్తుండగా సాయంత్రం 4:45 గంటలకు దేవపురం గ్రామాన్ని దాటి ఆంధ్రా చెక్‌పోస్ట్ సమీపానికి చేరుకునే సమయంలో ముగ్గురు ముసుగు దొంగలు ఆయనపై దాడిచేశారు. వ్యాపారిని కిందకు తోసేసి గొంతుపై కాలుపెట్టి తుపాకీని గురిపెట్టారు. ఆయన వద్ద ఉన్న రూ.50వేలను గుంజుకుని క్షణా ల్లో పరారయ్యారు. దుండగులు జరిపిన దాడిలో బాధితుడి ఎడమ వైపు శరీర భాగానికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడి నుంచి వివరాలు సేకరించి, ప్రాథమిక దర్యాప్తును ప్రారంభించారు.


