అర్జీలను సొంత సమస్యగా భావించాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీలను సొంత సమస్యగా భావించాలి

May 19 2026 12:52 AM | Updated on May 19 2026 12:52 AM

పార్వతీపురం: ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీని అధికారులు తమ సొంత సమస్యగా భావించి సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, వృద్ధులు, దివ్యాంగుల నుంచి కలెక్టర్‌ నేరుగా అర్జీలను స్వీకరించారు. వీల్‌చైర్‌పై వచ్చిన దివ్యాంగుల వద్దకు స్వయంగా వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులకు తక్షణ చర్యలపై అదేశాలు జారీ చేశారు. పీఎం కిసాన్‌ నిధులు, సదరం స్లాట్‌, ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌, భూ మ్యుటేషన్‌, భూ రికార్డుల సవరణ, ఆక్రమణలపై మొత్తం 70అర్జీలు అందగా వాటిలో 44 సాధారణ అర్జీలు, 26 రెవెన్యూకు సంబంధించినవి ఉన్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌లో వచ్చే ప్రతి అర్జీపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. నిర్ణీత గడువులోగా అర్జీలకు నాణ్యమైన పరిష్కారం అందించాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో జేసీ సి.యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి, డీఆర్‌ఓ కె.హేమలత, ఎస్‌డీసీ ఎస్‌.దిలీప్‌చక్రవర్తి పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.

చట్టపరిధిలో తక్షణ చర్యలు: ఎస్పీ

పార్వతీపురం రూరల్‌: జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్పీ ఎస్‌.వి.మాధవ్‌ రెడ్డి ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి, బాధితులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ విడత కార్యక్రమంలో కుటుంబ కలహాలు, సైబర్‌ మోసాలు, ఆన్‌లైన్‌ వంచన, భూ–ఆస్తి వివాదాలు, నకిలీ పత్రాలు, వేధింపులకు సంబంధించి 10 ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదుల పూర్వాపరాలను పరిశీలించిన ఎస్పీ..తక్షణమే సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. బాధితుల సమస్యలపై చట్టపరిధిలో పారదర్శకంగా, వేగవంతంగా దర్యాప్తు జరిపి తగిన చర్యలు చేపట్టాలని, వాటికి సంబంధించిన నివేదికను జిల్లా పోలీసు కార్యాలయానికి పంపాలని అధికారులను ఆదేశించారు. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ప్రజలు ఉపయోగించు కోవాలని ఎస్పీ సూచించారు. జిల్లా కేంద్రానికి రాలేని వారు తమ సమీపంలోని సబ్‌ డివిజన్‌ ఆఫీస్‌ లేదా పోలీస్‌ స్టేషన్లలో ఇచ్చే ఫిర్యాదులను కూడా ఈ వేదిక కిందనే పరిగణించి నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ ఆదాం, ఎస్సై అశోక్‌ చక్రవర్తి, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌కు 17 వినతులు

సీతంపేట: స్థానిక ఐటీడీఏలో ఏపీఓ చిన్నబాబు ఆధ్వర్యంలో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పొలాలకు వెళ్లడానికి రహదారి నిర్మించాలని ఇరపాడుగూడకు చెందిన సవర అప్పన్న కోరాడు. పవర్‌టిల్లర్‌ కావాలని ఎస్‌.నర్సిపురానికి చెందిన జీలకర్ర బాబురావు కోరగా వరదగోడ నిర్మించాలని ముత్యాలు కాలనీకి చెందిన సవర శ్యాం విన్నవించాడు. ఎస్‌ఓఈలో సీట్లు ఇప్పించాలని చాకలిగూడకు చెందిన బాలమురళి, శరణ్యలు వినతిపత్రాలు అందజేశారు. అంతర్గత సీసీ రోడ్డు నిర్మించాలని తుప్పలగూడ గ్రామ గిరిజనులు కోరారు. కార్యక్రమంలో ఐటీడీఏ స్పోర్ట్స్‌ ఇన్‌చార్జ్‌ జాకాబ్‌ దయానంద్‌, వ్యవసాయాధికారి వాహిని, హెచ్‌వో జయశ్రీ, ట్రాన్స్‌కో ఏఈ నీలిమ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement