● ఇన్‌చార్జ్ కలెక్టర్ సేతు మాధవన్
విజయనగరం ఫోర్ట్: గడువులోగా ప్రజాసమస్యలు పరిష్కరించాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ సేతు మాధవన్ అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్, రెవిన్యూక్లినిక్ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని ప్రజలు నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమస్యల సత్వర పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోను ఫిర్యాదులు మళ్లీ రీఓపెన్ కాకూడదని, ఒక వేళ ఏదైనాఅర్జీ రీ ఓపెన్ అయితే సంబంధిత అధికారి తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించాలన్నారు. పీజీఆర్‌ఎస్‌కు 188 వినతులు వచ్చాయి. అందులో అత్యధికంగా రెవెన్యూకు 72, జిల్లా పంచాయతీ విభాగానికి 26, డీఆర్‌డీఏకు 19, మున్సిపాల్టీకి 11, వైద్య ఆరోగ్యశాఖకు 6, విద్యాశాఖకు 5, గ్రామ వార్డు సచివాలయాలకు 3, విద్యుత్ శాఖకు 2, గృహ నిర్మాణశాఖకు 1, ఇతర అర్జీలు 43 వచ్చాయి.
ప్రజల సంతృప్తి స్థాయి పెరిగేలా అధికారులు
కృషి చేయాలి
ప్రజలకు సంతృప్తి స్థాయి పెరిగే విధంగా అధికారులు కృషి చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ సేతు మాధవన్ అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం సాయంత్రంనిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాజిటివ్ పర్సెప్షన్‌లో 8శాఖల పనితీరు సంతృప్తికరంగా ఉన్నట్టు నివేదికలు ఉన్నాయన్నారు. గుంతలరహదారిపై పట్టణ ప్రాంతం నుంచి ఎక్కువగా ఐవీఆర్‌ఎస్ కాల్స్ అందుతున్నందున సంబంధిత మున్సిపల్, ఆర్‌అండ్‌బీ అధికారులు శ్రద్ధ వహించాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన విజయనగరం మండల, వంగర మండల సర్వేయర్లకు, పీజీఆర్‌ఎస్‌కు గైర్హాజరైన ప్రజారవాణా అధికారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మండలాల్లో వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ చేసేందుకు గుర్తించిన స్థలాలను వారంలోగా డీఆర్‌డీఏ పీడీకి అప్పగించాలని తహసీల్దార్లను ఆదేశించారు. సమావేశంలో డీఆర్‌ఓ సత్తిబాబు, సీపీఓ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.


