గంజాయి నిందితుల ఆస్తులు జప్తు చేయాలి | - | Sakshi
Sakshi News home page

గంజాయి నిందితుల ఆస్తులు జప్తు చేయాలి

May 19 2026 12:52 AM | Updated on May 19 2026 12:52 AM

శృంగవరపుకోట: గంజాయి కేసుల్లో అరెస్టయిన నిందితులపై హిస్టరీ షీట్లు తెరిచి వారు గంజాయి వ్యాపారంలో అక్రమంగా సంపాదించిన ఆస్తులను జప్తు చేయాలని ఎస్పీ ఏఆర్‌.దామోదర్‌ పోలీస్‌ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం గంట్యాడ, ఎస్‌.కోట పోలీస్‌ స్టేషన్‌లను ఆయన ఆకస్మికంగా సందర్శించి స్టేషన్‌ ప్రాంగణాలు, ప్రాపర్టీ రూంలు, లాకప్‌ గదులను పరిశీలించారు. పోలీస్‌ స్టేషన్‌ ప్రాంగణంలో సీజ్‌ చేసి ఉన్న వాహనాలను పరిశీలించి, వాటిని చట్ట ప్రకారం త్వరగా డిస్పోస్‌ చేయాలని అధికారులకు సూచించారు. ఎస్‌.కోట పోలీస్‌ స్టేషన్‌లోని వివిధ రికార్డులు, సీడీ ఫైల్స్‌ను ఎస్పీ ఏఆర్‌.దామోదర్‌ తనిఖీ చేశారు. పక్క జిల్లా, పక్క రాష్ట్రాల నుంచి బొడ్డవర మీదుగా ఇతర ప్రాంతాలకు గంజాయి రవాణా జరుగుతున్నందున, అక్రమ రవాణా నియంత్రణే లక్ష్యంగా బొడ్డవర చెక్‌ పోస్టును బలోపేతం చేశామని, నిరంతరం వాహన తనిఖీలు చేపట్టే విధంగా చర్యలు చేపట్టామన్నారు. గంజాయి కేసుల్లో పట్టుబడిన నిందితులపై పీడీ యాక్ట్‌ ప్రయోగించాలని, అంతేకాకుండా హిస్టరీ షీట్లు తెరిచి వారి కదలికలపై నిఘా ఏర్పాటు చేయాలని, వారు గంజాయి వ్యాపారంలో అక్రమంగా సంపాదించిన ఆస్తులను జప్తు చేసే ఆలోచన చేస్తున్నామన్నారు. ఎస్పీ వెంట ఎస్‌.కోట సీఐ వి.నారాయణమూర్తి, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, ఎస్‌.కోట ఎస్సై ఎల్‌.చంద్రశేఖర్‌, గంట్యాడ ఎస్సై సాయికృష్ణ, ఇతర పోలీస్‌ అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement