అరచేతిలో వైకుంఠం చూపించడం అన్న సామెత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరుకు సరిగ్గా సరిపోతుందని అంతా వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల ముందు ఆడబిడ్డలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కొత్తగా ముగ్గురు పిల్లలను కంటే రూ.30 వేలు, నలుగురు పిల్లలను కంటే రూ.40 వేలు మహిళలకు ఇస్తామంటూ సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన చూసి అంతా ఈ విధంగా చర్చించుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్య, మధ్య తరగతి కుటుంబాల్లో ఒకరు లేదా ఇద్దరు పిల్లలను పెంచడానికే ఆ తల్లిదండ్రులు నానా యాతన పడుతున్నారు. గతంలో ఇచ్చిన హామీల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకే ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారని, అయితే గత ఎన్నికల ముందు కూటమి నాయకులు ఇచ్చిన హామీలను ప్రజలెవరూ మరవలేదనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని పలువురు గుర్తు చేస్తున్నారు.
వీరఘట్టం/పాలకొండ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 18 నుంచి 59 ఏళ్ల లోపు వయస్సు మహిళలందరికీ ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసి ప్రతి మహిళకు నెలకు రూ.1500 నేరుగా ఖాతాలో జమ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో ప్రతి బహిరంగ సభలో హామీ ఇచ్చారు. ఆ మాటలు నమ్మి చాలా మంది అక్కచెల్లెమ్మలు ఓటేశారు. అయితే ఏం లాభం? కూటమి ప్రభుత్వం ఏర్పడి 23 నెలలు కావొస్తున్నా..ఆడబిడ్డ నిధి పథకం అమలుపై నోరుమెదపడం లేదు. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో గాని, మంత్రి వర్గ భేటీలో గాని ఇంతవరకు ఒక్కసారి కూడా ఆ పథకం గురించి చర్చకు రాలేదు. అంటే ఈ పథకం కూడా గాలిలో కలిపేసినట్లేనా? అని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయకుండా కొత్తగా ముగ్గురు పిల్లల్ని కనండి, నలుగురు పిల్లల్ని కనండని సీఎం చంద్రబాబు ఇస్తున్న ఉచిత సలహాపై మహిళాలోకం సర్వత్రా భగ్గుమంటోంది.
అమలుకాని హామీలు..
సూపర్‌సిక్స్ పథకాలు అమలు చేశాం..ఇంకెవరైనా అమలు చేయలేదంటే వారి నాలుక మందమే అని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ సభలో పలికిన మాటలివి. తీరా చూస్తే మసి పూసి మారేడు కాయ చేసి ఇచ్చాం అన్నట్లు ఉంది కూటమి ప్రభుత్వం తీరు. కుట్రలో భాగంగా పీ–4 పథకంలో ఆడబిడ్డ నిధిని తోసేసి ఇచ్చేశాం అన్నట్లు కవర్‌చేసి చంద్రబాబు మహిళలకు శఠగోపం పెట్టారు.ఆడబిడ్డ నిధి పథకాన్ని మైమరిపించేందుకు ఇప్పుడు కొత్తగా పిల్లల్ని కనండంటూ చంద్రబాబు కొత్త డ్రామాకు తెరతీశారని మహిళలు విమర్శిస్తున్నారు.
జిల్లాలో రూ.776 కోట్ల బకాయి..
గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో 3,09,425 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.60 ఏళ్లు పైబడిన వారిని మినహాయిస్తే 2024 అక్టోబర్ నాటి లెక్క ప్రకారం 59 ఏళ్ల లోపు వారు 2.25 లక్షల మంది ఉన్నారు.వా రికి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.1500 చొప్పున చెల్లిస్తే నెలకు రూ.33.75 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 23 నెలలకు రూ.776 కోట్లు చెల్లించాల్సి ఉంది.ఈ నగదు ఎప్పుడు చెల్లిస్తారని మహిళలు ప్రశ్నిస్తున్నారు.ఈ మెత్తాన్ని ఒకే విడతలో చెల్లించడంతో పాటు రాబోయే రోజుల్లో ప్రతినెలా రూ.1500 చెల్లించాలని మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు.
గతంలో మహిళల జీవనోపాధికి అండగా ..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మహిళల జీవనోపాధికి పెద్దపీట వేసింది. అమ్మఒడి, వైఎస్సార్ ఆసరా, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, సున్నావడ్డీ, వైఎస్సార్ చేయూత లాంటి అనేక ముఖ్యమైన పథకాలన్నింటినీ నేరుగా మహిళల వ్యక్తిగత ఖాతాల్లోకి జమ చేసి వారి ఆర్థికాభివృద్ధికి అండగా నిలిచింది. మహిళల చేతికి చేరిన నగదు వృథా కాకుండా ఇంటి అవసరాలకే ఉపయోగపడుతుందని భావించి అనేక పథకాల డబ్బును మహిళల ఖాతాకే జమ చేసింది.
అమలుకు నోచుకోని పథకం
ఇప్పటికే ఒక్కో మహిళకు రూ.33 వేలు బకాయి
23 నెలల్లో జిల్లా మహిళలకు చెల్లించాల్సింది రూ:776 కోట్లు
ఇప్పుడేమో ముగ్గుర్ని కంటే రూ.30 వేలు..
నలుగుర్ని కంటే రూ.40 వేలు..
హాస్యాస్పదమవుతున్న సీఎం చంద్రబాబు కొత్త పథకం
ఎన్నికల హామీలు ఎగ్గొట్టేందుకు ఎత్తుగడ అని విమర్శలు


