మద్దతు గోరంత..! | - | Sakshi
Sakshi News home page

మద్దతు గోరంత..!

May 18 2026 6:51 AM | Updated on May 18 2026 6:51 AM

కంటితుడుపు ధరలతో కాటికి సాగుబడి

పెట్టుబడి

కొండంత..

పార్వతీపురం రూరల్‌: కూటమి ప్రభుత్వంలో సాగుబడి నానాటికీ కుదేలవుతోంది. రాబోయే ఖరీఫ్‌ సీజన్‌ (2026–27)కు సంబంధించి ప్రకటించిన కనీస మద్దతు ధరలు అన్నదాతల కష్టాలను తీర్చేలా లేకపోగా, వారిని మరింత కుంగదీసేలా ఉన్నాయి. ఎరువులు, పురుగు మందుల ధరలు రెట్టింపు అవుతుండడం, కూలీల ఖర్చులు విపరీతంగా పెరగడంతో పెట్టుబడులు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అరకొర మద్దతు ధరలు కంటితుడుపు చర్యగానే మిగిలాయి. దీనికి తోడు స్థానికంగా మార్కెట్లను క్రమబద్ధీకరించడంలో, రైతులకు అండగా నిలవడంలో కూటమి ప్రభుత్వం విఫలమవుతోందన్న ఆవేదన రైతులనుంచి క్షేత్రస్థాయిలో వ్యక్తమవుతోంది.

నామమాత్రంగా ధరల పెంపు..

ఈ ఖరీఫ్‌లో ప్రధాన పంట అయిన సాధారణ రకం వరి క్వింటాకు కేవలం రూ.72 మాత్రమే పెంచడంతో ప్రస్తుత ధర రూ.2,441కి చేరింది. గ్రేడ్‌–ఎ రకం వరి ధరను రూ.2,461గా నిర్ణయించారు. దీని ప్రకారం మార్కెట్‌లో 80 కేజీల ధాన్యం బస్తా ధర రూ.1,952 మాత్రమే పలకనుంది. ఇక అత్యధికంగా సాగయ్యే మొక్కజొన్నపై కేవలం రూ.10 (ప్రస్తుత ధర రూ.2,410), పెసరపై రూ.12 (ప్రస్తుత ధర రూ.8,780) మాత్రమే పెంచడం గమనార్హం. పత్తికి రూ.8,667, కందులుకు రూ.8,450, మినుములకు రూ.8,200 మద్దతు ధర నిర్ణయించినప్పటికీ..ఆయా పంటల పెట్టుబడి వ్యయంతో పోలిస్తే ఇవి ఏమాత్రం సరిపోవని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది. .

భారమవుతున్న సాగు

జిల్లాలో సుమారు 70 శాతం మంది ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో ఇన్‌పుట్‌ సబ్సిడీలు, ఎరువుల లభ్యతపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతో రైతులకు పెట్టుబడి భారం రెట్టింపైంది. ఏటా ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్ల ఉధృతితో పంట దిగుబడులు పడిపోతుంటే, మరోవైపు పెరిగిన కూలి రేట్లు సాగును మరింత కష్టతరం చేస్తున్నాయి. కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కకపోవడంతో, చివరకు దళారులు అడిగిన కాడికి అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి అదనపు బోనస్‌ లేదా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తమను ఆదుకోవాలని అన్నదాతలు నిట్టూరుస్తున్నారు.

ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి వ్యవసాయ రంగంపై, క్షేత్రస్థాయి సమస్యలపై కనీస అవగాహన గానీ, చిత్తశుద్ధి గానీ లేదు. పెట్టుబడులు కొండంత పెరిగితే, మద్దతు ధరలు గోరంత పెంచడం పాలకుల దారుణమైన వైఫల్యానికి నిదర్శనం. ఓ వైపు మార్కెట్లో నకిలీ విత్తనాలు, ఎరువుల సిండికేట్లను అణచివేయడంలో ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది. సాగు ఖర్చులు పెరిగిపోవడంతో రైతు పెట్టుబడి పెట్టలేక కుదేలవుతున్నాడు. రైతు ఇబ్బందుల్లో ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు పనులు దొరకక వలసలు పోవాల్సిన దుస్థితి దాపురిస్తోంది. కేవలం కేంద్రం ప్రకటించిన ధరలతో సరిపెట్టకుండా, రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా ప్రత్యేక బోనస్‌ ప్రకటించి ధాన్యం కొనుగోలు చేయాలి. దళారీల దోపిడీని అరికట్టడంలో విఫలమైతే రైతులు, కూలీలను ఏకం చేసి పెద్ద ఎత్తున నిరసనలు చేపడతాం.

– బీవీ రమణ, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు

అరకొరగా మద్దతు ధర పెంపు

వరి క్వింటాకు పెరిగిన ధర రూ.72

మొక్కజొన్నకు పది రూపాయలు

పెరిగిపోతున్న పెట్టుబడులు

పట్టించుకోని పాలకులు

Advertisement
 
Advertisement
Advertisement