పార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కారవేదికలో (పీజీఆర్‌ఎస్) అందజేసే అర్జీల వివరాలు మీకోసం వెబ్‌సైట్‌లో నమోదు చేయవచ్చునని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజల కోరిక మేరకు ప్రతిసోమవారం ఉదయం 9 గంటలనుంచి12 గంటలవరకు అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా కలెక్టరేట్‌లో రెవెన్యూ క్లినిక్‌ను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. అర్జీలను మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చునని, వాటి స్థితిని 1100 టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చునని స్పష్టం చేశారు.
కుందర తిరువాడలో ఏనుగుల సంచారం
జియ్యమ్మవలస రూరల్: జియ్యమ్మవలస మండలంలోని చినకుదమ, కుందరతిరువాడ గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు సంచరిస్తుండడంతో రైతులు, ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు ఇటీవల పెదబుడ్డిడి, చినబుడ్డిడి ప్రాంతాల్లో పంట ధ్వంసం చేసిన ఏనుగులు ఆదివారం ఇటువైపు రావడంతో పొలం పనులకు వెళ్లే రైతులు, ప్రయాణికులు భీతిల్లుతున్నారు.
శాంతిభద్రతలపై డీజీపీ ఆరా
పాచిపెంట: జిల్లాలో శాంతిభద్రతలపై ఎస్పీ మాధవవరెడ్డిని రాష్ట్ర డీజీపీ హరీష్ గుప్తా ఆరా తీశారు. పాచిపెంట మండలంలో పి.కోనవలస మీదుగా ఒడిశా వెళ్తున్న ఆయన పి.కోనవలస ఐటీ డీఏ గెస్ట్‌హౌస్ వద్ద ఆదివారం ఉదయం కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఈనేపథ్యంలో డీజీపీని ఎస్పీ మాధవరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుషగుచ్ఛం అందించారు.
అనంతరం జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణపై డీజీపీ చర్చించి పలు సూచనలు సలహాలను ఇచ్చారు.డీజీపీని కలిసిన వారిలో రూరల్ సీఐ రామకృష్ణ, పట్టణ సీఐ అప్పలనాయుడు తదితరులు ఉన్నారు.


