గరుగుబిల్లి: ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గరుగుబిల్లి మండలంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పెద్దూరు గ్రామానికి చెందిన రాజాన భాస్కరరావు(24), భోగి తేజ వ్యక్తిగత పనుల నిమిత్తం పార్వతీపురం వచ్చి, తిరుగు ప్రయాణంలో పార్వతీపురం నుంచి పెద్దూరు గ్రామానికి వెళ్తున్నారు. అదే సమయంలో ఎదురుగా పార్వతీపురం వైపు నుంచి మరో ద్విచక్రవాహనంపై ఇద్దరు వ్యక్తులు వస్తుండగా రహదారి పరిధిలోని ఉల్లిభద్ర కూడలి వద్ద ప్రమాదవశాత్తు ఒకదాని కొకటి రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు వాహనాలపై ఉన్న నలుగురూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పెద్దూరు గ్రామానికి చెందిన రాజాన భాస్కరరావు మృతి చెందాడు. రావుపల్లి తేజాతో పాటు మరో బైక్‌పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుడు భాస్కరరావుకు తల్లి ఆదిలక్ష్మి, చెల్లి ఉన్నారు. కుమారుడి మృతితో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. భాస్కరరావు, తేజాలు విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఒకే దగ్గర ఉంటున్నారు. భోగి తేజ, తల్లి వర్ధంతి కార్యక్రమానికి రెండు రోజుల క్రితం గ్రామానికి ఇద్దరూ వచ్చారు. ఈ ఘటనపై ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
డెంకాడ: మండలంలోని పెదతాడివాడ కూడలి వద్ద ఆర్‌అండ్‌బీ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం రెండు ఆటోలు ఢీకొన్న సంఘటనలో వలిరెడ్డి పద్మ (49) ప్రమాద స్థలంలోనే మృతి చెందింది. ఈ ప్రమాద సంఘటనకు సంబంధించి ఎస్సై సన్యాసినాయుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పూసపాటిరేగ మండలం, పూసపాటిపాలెం గ్రామానికి చెందిన ఐదుగురు మహిళలు, ఆటోపై జామి మండలం భీమసింగి గ్రామానికి శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా పెదతాడివాడ కూడలి వద్దకు వచ్చేసరికి వారి ఆటోను వెనక నుంచి మరొక ఆటో బలంగా ఢీకొనడంతో అదుపుతప్పి ఆటో తిరగబడడంతో వలిరెడ్డి పద్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయం అదే ఆటోలో ప్రయాణిస్తున్న మహిళలు మృతురాలి కుటుంబసభ్యులకు తెలియపరచగా వెంటనే కుటుంబ సభ్యులు ప్రమాద స్థలానికి చేరుకుని భోరుమన్నారు. మృతురాలి కుమారుడు వలిరెడ్డి రాంబాబు డెంకాడ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
సీతంపేట: మండలంలోని సోమగండి గ్రామానికి చెందిన బాలింత నిమ్మక మాధురి (32) శ్రీకాకుళంలోని జెమ్స్ ఆస్పత్రిలో ఆదివారం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు, గ్రామస్తులు తెలిపారు. రెండో కాన్పులో ఆమె గర్భం దాల్చిన నాటి నుంచి పాలకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటోంది. ఈ క్రమంలో శుక్రవారం ఆస్పత్రిలో ప్రసవం కోసం కుటుంబసభ్యులు చేర్చగా వైద్యసిబ్బంది సిజేరియన్ చేశారు. మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం పచ్చకామెర్ల లక్షణాలు, యూరిన్ నిలిచిపోవడం,ఆరోగ్యం క్షీణించడంతో మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళంలోని రాగోలు జెమ్స్ ఆస్పత్రికి వైద్యులు రిఫర్ చేశారు. దీంతో అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. బిడ్డ క్షేమంగా ఉన్నాడు. మృతురాలికి భర్త శివకుమార్, మూడున్నరేళ్ల ఆరాధ్య అనే కుమార్తె ఉన్నారు. మాధురి పాలకొండ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఆఫీస్ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. మాధురి మృతితో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
గజపతినగరం రూరల్: మండలంలోని దావాలపేట గ్రామ సమీపాన గల రైల్వే గేట్ వద్ద మూడు రోజుల క్రితం రైలు నుంచి జారిపడి ఓ మహిళ మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ బండారు ఈశ్వరరావు ఆదివారం సాయంత్రం అందించిన వివరాల ప్రకారం, దావాలపేట గేట్‌మన్ ఆదివారం ఉదయం 8.30 గంటల సమయంలో గుర్తు తెలియని మృతదేహం రైల్వే ట్రాక్ సమీపంలో ఉండడాన్ని చూసి రైల్వే పోలీసులకు సమాచారం అందజేశాడు. దీంతో జీఆర్పీ సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని అక్కడ ఉన్న ఆనవాళ్లు, ఆధారాలు సేకరించారు. ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా ముఖానందపూర్ గ్రామానికి చెందిన మమత ట్యాండ్ అలియాస్ బేగ్‌ద (37) మృతదేహంగా గుర్తించారు. వెంటనే ఆమె కుటుంబసభ్యులకు సమాచారం అందజేశారు. ఈనెల 14వ తేదీన జునాగఢ్ నుంచి భువనేశ్వర్‌కు జునాగర్ ఎక్స్‌ప్రెస్‌లో మమతా బేగ్ ప్రయాణం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఈ మేరకు విజయనగరం రైల్వే సబ్ ఇన్‌స్పెక్టర్ వి.బాలాజీ రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


