క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యం

May 16 2026 1:15 AM | Updated on May 16 2026 1:15 AM

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి

విజయనగరం: అధికారంలో ఉన్నా.. లేకున్నా నిరంతర ప్రజా సంక్షేమం, శ్రేయస్సు కోసం పని చేసే వైఎస్సార్‌సీపీని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేయటమే లక్ష్యంగా పని చేయాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు సూచించారు. శుక్రవారం రింగ్‌రోడ్డులోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిశీలకులతో నిర్వహించిన సమావేశంలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రజా సమస్యలపై పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, జిల్లాలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ జాతీయ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ సంస్థాగత బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. అన్ని నియోజకవర్గాల్లో పార్టీని మరింత పటిష్టంగా నిర్మించేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియలో నియోజకవర్గ సమన్వయకర్తలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రధానంగా పార్టీ పరంగా కమిటీల నియామకాలను శతశాతం పూర్తి చేయాలని, బీఎల్‌ఏలను నియమించాలని దిశా నిర్దేశం చేశారు. పార్టీలో అసమ్మతులతో చర్చించి ఎప్పటికప్పుడు పరిస్థితులను చక్కదిద్దటంతో పాటు కూటమిలో వ్యతిరేకులను ఆకర్షించి పార్టీలో చేరేలా కృషి చేయాలని తెలిపారు.

చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలనపై విస్తృత ప్రచారం చేయాలి

రెండేళ్ల క్రితం అధికారం కోసం అమలుకు సాధ్యం కాని హమీలు గుప్పించి నేడు వాటిని అమలు చేయకుండా అబద్దపు ప్రచారాలు చేస్తున్న చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలనపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అర్హులైన ఒక్కరికి కొత్త పింఛను ఇవ్వలేదన్నారు. సూపర్‌ సిక్స్‌ హమీలు గాల్లో కలిపేసి అన్ని అమలు చేసామంటూ ప్రచారం చేసుకోవటాన్ని ప్రజలకు వివరించాలన్నారు. నిరుద్యోగులకు ఇస్తామన్న భృతిపై ప్రభుత్వంలో చలనం లేదని ఇటువంటి ప్రజా వ్యతిరేక పాలనను ప్రజలతోనే తరిమికొట్టించాలని సూచించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు వర్రి నర్సింహమూర్తి, గొర్లె రవికుమార్‌, చీపురుపల్లి నియోజకవర్గ పరిశీలకులు శోభా స్వాతీరాణి, ఎస్‌.కోట నియోజకవర్గ పరిశీలకులు కె.భాగ్యలక్ష్మి, గజపతినగరం నియోజకవర్గ పరిశీలకులు సిరిపురపు జగన్‌మోహన్‌రావు, రాజాం నియోజకవర్గ పరిశీలకులు కెవి.సూర్యనారాయణరాజు, నెల్లిమర్ల నియోజకవర్గ పరిశీలకులు నెక్కల నాయుడుబాబు, బొబ్బిలి నియోజకవర్గ పరిశీలకులు రొంగలి జగన్నాధరావు తదితరులు పాల్గొన్నారు.

మరి కొద్ది నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయన్న సంకేతాల నేపథ్యంలో పార్టీ క్యాడర్‌ను అందుకు సిద్ధం చేయాలని మజ్జి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గ్రామాల్లో, వార్డుల్లో పార్టీ నాయకులతో తరచూ సమావేశాలు నిర్వహించాలన్నారు. తద్వారా పార్టీ నేతల్లో ఉత్సాహాన్ని నింపి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్‌ను సిద్ధం చేయాలి

కూటమి ప్రజా వ్యతిరేక విధానాలను

ప్రజల్లోకి తీసుకువెళ్లాలి

జిల్లా పరిషత్‌ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ

జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు

7 నియోజకవర్గాల పరిశీలకులతో సమావేశం

Advertisement
 
Advertisement
Advertisement