సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం ఐటీడీఏలో వివాదాల నేపథ్యంలో ఏడుగురు ఉద్యోగులకు కొద్ది రోజుల క్రితం విభాగాలను మా ర్చిన విషయం విదితమే. జూనియర్, సీనియర్ సహాయకులను ఐటీడీఏ నుంచి గిరిజన సంక్షే మ శాఖకు.. ఇటు వైపు వారిని అటు మార్చా రు. దీనిపై కొద్ది రోజులు సందిగ్ధత ఏర్పడింది. పీఓగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన వైశాలి
తక్షణమే వారికి అప్పగించిన నూతన విధుల్లో చేరాలని స్పష్టం చేశారు. గిరిజన సంక్షేమ శాఖ విధుల పట్ల అవగాహన లేని వారిని నియమించడంపై పాలనాపరంగా ఇబ్బందులు ఎదురవుతాయని డీడీ విజయశాంతి పీఓ వైశాలి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సానుకూలంగా స్పందించిన పీఓ.. వారి డిప్యుటేన్లను రద్దు చేశారు. పూర్వ స్థానంలో యథావిధిగా పని చేసుకోవా లని ఉత్తర్వులు జారీ చేశారు.
పార్వతీపురం రూరల్ : ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్ర స్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో అందడమే లక్ష్యంగా అధికారులు పని చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్.వైశాలి ఆదేశించారు. ఐటీడీఏ కార్యాలయంలోని తన చాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో ఆమె ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ.. పాడి–పంటపై ఆధారపడిన వారికి అండగా నిలవాలని, తక్షణమే అర్హులైన లబ్ధిదారులను గుర్తించి పాడి ఆవులను పంపిణీ చేయాలని సూచించారు. పశుగ్రాసం కోతకు ఉపయోగపడే ‘చాఫ్ కట్టర్ల’ పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపరిచేందుకు డ్రాగ్ నెట్లు, చేపల ఉత్పత్తి పెంపునకు పోర్టబుల్ హేచరీల ఏర్పాటుకు అనువైన స్థలాలు, ఆసక్తి గల లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమ ఫలాలు పారదర్శకంగా అందాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి నిర్దేశించిన గడువులోగా నివేదికలు సమర్పించాలని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డా. ఎస్.మన్మధరావు, మత్స్య శాఖాధికారి టి.సంతోష్‌కుమార్, ఎం.హెచ్.ఓ, డీఆర్‌డీఏ అధికారులు పాల్గొన్నారు.
పార్వతీపురం రూరల్: మండలంలోని అడారు ప్రాథమిక పాఠశాల ఆవరణలో అనధికారికంగా టేకు చెట్లను నరికి తరలించిన ఘటనపై అటవీశాఖ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సాలూరు రేంజర్ పవిత్‌నాయుడు ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన సిబ్బంది. నిడగల్లులోని ఒక టింబర్ మిల్లులో దాచిన టేకు దుంగలను స్వాధీనం చేసుకుని సాలూరు రేంజ్ కార్యాలయానికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి డీకే పట్నం గ్రామానికి చెందిన ఇద్దరు రాజకీయ నాయకులు, తెలుగుదేశం పార్టీకి చెందిన మరో నేత సహా ముగ్గురికి శుక్రవారం అటవీశాఖ నోటీసులు అందజేసింది. మక్కువ ఫారెస్టర్ శ్రీనివాసరావు పర్యవేక్షణలో జరిగిన ఈ ప్రక్రియలో నిందితులు నోటీసులు తీసుకోకపోతే ఇళ్ల గోడలకు అతికించనున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం నాటికి విచారణకు హాజరుకావాలని, వారి స్టేట్‌మెంట్ల ఆధారంగా నివేదికను జిల్లా అటవీ అధికారికి పంపి అపరాధ రుసుము విధిస్తామని స్పష్టం చేశారు. కాగా, ఈ వ్యవహారంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు (హెచ్‌ఎం) ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసుల దర్యాప్తు ఇంకా ముందుకు సాగలేదు. ఏం జరుగుతుందో వేచి చూడాలి.


