ప్రైవేటు వెంబడి పంతుళ్లు | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటు వెంబడి పంతుళ్లు

May 15 2026 12:37 PM | Updated on May 15 2026 12:37 PM

–8లో

న్యూస్‌రీల్‌

కార్పొరేట్‌ పాఠశాలలపై ఉదాసీనత ఎందుకు?

–8లో

కౌలు రైతులకు ఎరువు కరువే..!

గతంలో మాదిరిగా ఎరువులు ఎక్కడ కావాలంటే అక్కడ..ఎప్పుడు కావాలంటే అప్పడు లభించే పరిస్థితి ఉండదు.

శుక్రవారం శ్రీ 15 శ్రీ మే శ్రీ 2026

సాక్షి, పార్వతీపురం మన్యం: రపభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక కోసం ఉపాధ్యాయులకు కూడా ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. పాఠశాలల బలోపేతానికి విద్యార్థుల చేరిక ముఖ్యమే. దీన్ని కాదనలేం. ఇందుకోసం.. తక్కువ సౌకర్యాలున్న చిన్న చిన్న ప్రైవేట్‌ స్కూళ్లపై గురి పెట్టాలని చెప్పడమే ఆయా యాజమాన్యాలకు ఆందోళన కలిగిస్తోంది. విద్యాశాఖ అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు కార్పొరేట్‌ విద్యాసంస్థలకు పరోక్షంగా దన్నునిచ్చేలా కనిపిస్తున్నాయి. ఇటీవల అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులతో వెబ్‌ సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో అడ్మిషన్లకు సంబంధించిన చర్చలో చిన్న ప్రైవేట్‌ పాఠశాలలపైనే దృష్టి పెట్టాలని, కార్పొరేట్‌ విద్యాసంస్థల జోలికి వెళ్లవద్దని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు భోగట్టా. దీనిపై ఉపాధ్యాయ వర్గాలతో పాటు, చిన్న పాఠశాలల యాజమాన్యాలు మండిపడుతున్నాయి.

చేరిక ముఖ్యమే.. ఇలానా?

జిల్లాలో మొత్తం ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు 1,507 ఉన్నాయి. ఇందులో సుమారు 1.30 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 14 జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. మన్యం జిల్లా నాలుగు సంవత్సరాలుగా పదో తరగతి పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలోనే ప్రథమ స్థానంలో నిలుస్తోంది. జూనియర్‌ కళాశాలలు సైతం ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాయి. ఇదే సమయంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నాడు–నేడు కింద సర్కారు పాఠశాలల్లో విప్లవాత్మక సంస్కరణలను తీసుకొచ్చింది. దీనివల్ల ప్రభుత్వ బడులు బలోపేతం అయ్యాయి. దీంతో సర్కారు పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు ప్రస్తుత ప్రభుత్వంలో ‘బడి పిలుస్తోంది’ పేరిట ఉపాధ్యాయులను గ్రామాల్లోకి పంపిస్తోంది. పిల్లలను తమ బడుల్లో చేర్పించాలని ఉపాధ్యాయులకు లక్ష్యం విధించింది. ప్రైవేటు స్కూళ్లు వదిలి, ఇక్కడికి ఎందుకు వస్తారని ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయగా.. సి – కేటగిరీ స్కూళ్లనే లక్ష్యంగా చేసుకోవాలని, కార్పొరేట్‌ జోలికి వెళ్లవద్దని రాష్ట్ర విద్యా శాఖ అధికారులు సూచించడం గమనార్హం. ఈ ప్రభావం గ్రామాలు, కాలనీల్లో నడుస్తున్న సింగిల్‌ మేనేజ్మెంట్‌, అతి తక్కువ విద్యార్థులతో నడుస్తున్న చిన్న పాఠశాలలపై ఎక్కువ ప్రభావం పడుతుందని ఆయా యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తమ వద్దకు వస్తున్న వారే పేద, మధ్య తరగతి పిల్లలు అని.. ఫీజులు సకాలంలో ఇవ్వకపోయినా, తగ్గించినా తాము ఏమీ అనలేమని అంటున్నారు. టీచర్ల జీతాలు, నిర్వహణ ఖర్చు అన్నీ పోనూ మిగిలేది ఏదీ ఉండదని చెబుతున్నారు. ఏళ్లుగా ఇదే వృత్తిలో ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పాఠశాలలను నడుపుతున్నామని చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల విద్యార్థుల సంఖ్య తగ్గితే.. వేలాది మంది ఉపాధ్యాయులు, సిబ్బంది జీవనోపాధిపై దెబ్బ పడుతుందని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు, ప్రభుత్వ బడుల్లో చేరాలనుకుంటున్న విద్యార్థులకు ప్రైవేటుపాఠశాలలు టీసీలు ఇవ్వకుంటే ఎంఈఓలకు తెలియజేయాలని, వారే యూడైస్‌లో పేర్లను తొలగించి టీసీలు మంజూరు చేస్తారని చెప్పడంపైనా ప్రైవేట్‌ పాఠశాలల నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి విధానాలకు పాల్పడితే ఆందోళన బాట పట్టక తప్పదని హెచ్చరిస్తున్నారు.

ప్రభుత్వ బడుల్లో చేరికల కోసం ఉపాధ్యాయులపై ఒత్తిళ్లు

కార్పొరేట్‌కు కొమ్ము కాసేద్దాం.. చిన్న పాఠశాలలకు చెక్‌ పెట్టేద్దాం!

సి – కేటగిరీ ప్రైవేటు స్కూళ్లనే లక్ష్యంగా చేసుకోవాలని పిలుపు

అక్కడి నుంచే పిల్లలను తేవాలని ఆదేశాలు

కార్పొరేట్‌ స్కూళ్ల వైపు చూడొద్దని సూచన

ప్రభుత్వ తీరు పెద్ద సంస్థలకు దన్ను ఇచ్చేలా ఉందంటున్న చిన్న పాఠశాలల యాజమాన్యాలు

మరోవైపు కార్పొరేట్‌, పెద్ద ప్రైవేట్‌ స్కూళ్లవైపు చూడొద్దని పరోక్షంగా చెప్పడం ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి అద్దం పడుతోంది. ఇప్పుటికే కార్పొరేట్‌ స్కూళ్లు ఫీజులు, పుస్తకాలు, యూనిఫారాలు పేరిట విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి రక్తం పిండేస్తున్నాయి. వీటిపై విద్యా శాఖాధికారుల పరిశీలన, చర్యలు తీసుకునే పరిస్థితి ఉండదు. కార్పొరేట్‌ స్కూళ్లకు ప్రభుత్వం కొమ్ము కాస్తోందని విద్యార్థి సంఘాలు విమర్శలు గుప్పిస్తున్నా స్పందించిన దాఖలాలు లేవు. కార్పొరేట్‌ పాఠశాలల పట్ల ఉదాసీనత ఎందుకు ప్రదర్శిస్తున్నారో అర్థం కావడం లేదని విద్యార్థి సంఘాలు దుయ్యపడుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement