రామభద్రపురం:
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఉత్తీర్ణత అయ్యవార్లందరికీ తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పు ఆందోళన కలిగిస్తోంది. టీచర్లు ప్రస్తుత సర్వీసు కొనసాగించాలన్నా.. ఉద్యోగోన్నతి పొందాలన్నా టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి. 20, 25 ఏళ్ల కిందట ఉపాధ్యాయులుగా ఎంపికై న వారంతా ఈ వయస్సులో టెట్ రాసి ఉత్తీర్ణత ఎలా సాధిస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తాము పిల్లలకు చదువు చెప్పాలా? పరీక్షకు సిద్ధంకావాలా అనే సందిగ్దంలో పడ్డారు. గురువుల భవితకు సుప్రీం తీర్పు ‘పరీక్ష’గా మారింది. దీనికి తోడు ఐదేళ్లకు పైబడి సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు రెండేళ్ల లోపు టెట్ రాసి ఉత్తీర్ణులవ్వాలని సూచించింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కనీసం పట్టించుకోకుండా, కోర్టులో అప్పీలు చేయకుండా మిన్నకుండడంపై ఉపాధ్యాయులు, సంఘ నాయుకులు మండిపడుతున్నారు. టెట్ నుంచి ఉపశమనం కల్పిస్తామంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విస్మరించడంపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఇన్‌సర్వీసు ఉపాధ్యాయులను మినహాయించాలి..
టెట్ నోటిఫికేషన్‌లో ఇన్ సర్వీసు ఉపాధ్యాయులను మినహాయించేలా చర్యలు తీసుకోవాలి. సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని ప్రభుత్వం తొందర పడడం సరికాదు. ఉపాధ్యాయులందరిలోనూ టెట్ పరీక్ష అలజడిరేపుతోంది. ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలి. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్–2009 ప్రకారం 2011కు ముందు టెట్ అమలులో లేదు. టెట్ అమలులోకి రాకముందు నియాకమైన ఉపాధ్యాయులకు ఆ పరీక్ష నుంచి మినహాయింపు వచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి.
– బొప్పే రవికుమార్, ఏపీటీఎఫ్(1938)
రామభద్రపురం మండలశాఖ అధ్యక్షుడు
ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలి..
ఉపాధ్యాయులు తప్పనిపరిగా టెట్ పరీక్ష రాసి ఉత్తర్ణత సాధించాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలి. 20, 30 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన టీచర్లను ఇప్పుడు టెట్ పరీక్ష రాసి ఉత్తర్ణత సాధించాలనడం ఒత్తిడికి గురిచేస్తోంది. ఉద్యోగోన్నతులు కూడా టెట్ రాయాలనే నిబంధన సరికాదు. బీఈడీ, డీఈడీ పూర్తిచేసి, డీఎస్సీతో ఎంపికై న వారికి టెట్ ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన సవరించాలి. – ప్రసన్నకుమార్,
యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షుడు, రామభద్రపురం
ఉపాధ్యాయ కోణంలో పరిశీలించాలి..
డీఎస్సీ అమలు నాటి నుంచి కాకుండా మధ్యలో టెట్ నిబంధన తెరపైకి తీసుకురావడం సరైనది కాదు. ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురవుతారు. టెట్ ఉత్తీర్ణత తప్పనిపరి చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉపాధ్యాయ కోణంలో పరిశీలించాలి. టెట్ ప్రిపేరయ్యేందుకు సమయం ఉండదు. రెండేళ్లలో టెట్ ఉత్తీర్ణత సాధించాలన్న నిబంధన పెట్టడం సరికాదు. – జేసీ రాజు,
ఏపీటీఎఫ్ రాష్ట్ర అకడమిక్ కన్వీనర్, బొబ్బిలి
5,400 మందికి తప్పనిసరి..
ఉమ్మడి విజయనగరం జిల్లాలో టీచర్లు సుమారు 9,000 మంది ఉండగా ఇందులో సుమారు 5,400 మంది వరకు టెట్ రాయాల్సి ఉంటుందని ఉపాధ్యాయ సంఘాల అంచనా. వీరిలో 2010 కంటే ముందు ఉపాధ్యాయ పోస్టులు సాధించిన వారిలో ఐదేళ్లలోపు సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు మినహా ఐదేళ్లకు పైబడి సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు రెండేళ్లలోపు టెట్ రాసి ఉత్తీర్ణులు కావాలి. అయితే, 2010 ఆగస్టు నాటికి సర్వీసులో ఉన్న టీచర్లకు టెట్ తప్పనిసరి విషయం నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీటీఈ) నిబంధనల్లో ఎక్కడా లేదని ఉపాధ్యాయ నేతలు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ సైతం వృత్తిలో ఉన్న టీచర్లు టెట్ అర్హత కలిగి ఉండాలనే ఉత్తర్వులు ఎక్కడా ఇవ్వలేదని స్పష్టం చేస్తున్నారు. టెట్ పరీక్షకు సంబంధించి ఉపాధ్యాయులు వినతులివ్వగా టెట్‌పై ఉపశమనం కల్పిస్తామని హామీ ఇచ్చిన విద్యాశాఖ మంత్రి లోకేశ్ పట్టించుకోవడంలేదని ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగన్నతికి టెట్ నుంచి మినహాయింపు ఇచ్చేలా చట్ట సవరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వ టీచర్లకు టెట్ తప్పనిసరి
అయోమయంలో అయ్యవార్లు..!
టెట్ నుంచి ఉపశమనం కల్పిస్తామన్న హామీని విస్మరించిన విద్యాశాఖా
మంత్రి లోకేశ్
తలలు పట్టుకుంటున్న
ఉపాధ్యాయులు


