దోమల నివారణ చర్యలకు కలెక్టర్‌ ఆదేశం | - | Sakshi
Sakshi News home page

దోమల నివారణ చర్యలకు కలెక్టర్‌ ఆదేశం

May 15 2026 12:37 PM | Updated on May 15 2026 12:37 PM

పార్వతీపురం: జిల్లాలో దోమల లార్వా నిర్మూలనను యుద్ధ ప్రాతిపదికన నిర్వహించి, 15 రోజుల్లో దోమల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌. ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. మనమిత్ర, ఫార్మర్స్‌ యాప్‌ల వినియోగం, ఈఎఫ్‌ సర్వే, సచివాలయ సిబ్బంది హాజరు, లార్వా వేట తదితర అంశాలపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో గురువారం సమీక్షించారు. ఫాగింగ్‌ కంటే దోమల ఉత్పత్తి కేంద్రాల నిర్మూలనకే ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ఇంటింటికీ వెళ్లి నీటి నిల్వలు పరిశీలించి తొలగించాలని, పాత టైర్లు, కొబ్బరి బొండాల్లో నీరు నిల్వ కాకుండా చూడాలని సూచించారు. వరి పొలాల్లో కూడా దోమల పెరుగుదల నివారణకు రైతులకు అవగాహన కల్పించాలని, బంతిపూల మొక్కలు పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫార్మర్స్‌ యాప్‌, మనమిత్ర వాట్సాప్‌ గవర్నెన్స్‌ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

హెచ్‌సీ వైద్యఖర్చులకు సిబ్బంది చేయూత

విజయనగరం క్రైమ్‌: ప్రార్థించే పెదవులు కన్నా... సాయం చేసే చేతులు మిన్న అన్న పెద్దల మాటను జిల్లా పోలీశాఖ సిబ్బంది గురువారం అక్షరాలా పాటించారు. గంట్యాడ పోలీస్‌ స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేస్తున్న ఆదిమడపల శ్రీనివాసరావు గతనెల 28న బొబ్బిలిలో జరిగే పండగ బందోబస్తుకు వెళ్తుండగా గజపతినగరం వద్ద కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం విశాఖపట్నం మెడికవర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హెచ్‌సీని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఆరోగ్య భద్రత అధికారులతో ఎస్పీ మాట్లాడి రూ.3 లక్షలు మంజూరు చేయించారు. మెరుగైన చికిత్సకు అదనంగా డబ్బులు అవసరంకావడంతో ‘చేయూత‘ పథకం కింద సిబ్బంది అంతా కలిసి ఇచ్చిన రూ.6.75 లక్షలను శ్రీనివాసరావు భార్య వెంకటలక్ష్మి, కుమార్తె గౌతమిలకు ఎస్పీ దామోదర్‌ గురువారం తన కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో విజయనగరం ఇన్‌చార్జి డీఎస్పీ ఎస్‌.రాఘవులు, ఎస్బీ సీఐలు ఎ.వి.లీలారావు, విద్యాసాగర్‌, వన్‌టౌన్‌ సీఐ ఆర్‌వీఆర్‌కే చౌదరి, రూరల్‌ సీఐ బి.లక్ష్మణరావు, డీసీఆర్బీ సీఐ కె.కుమారస్వామి, రిజర్వు ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.గోపాలనాయుడు, పోలీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

ఐటీఐ ఉత్తీర్ణులకు జర్మన్‌ భాషపై ఉచిత శిక్షణ

విజయనగరం రూరల్‌: స్థానిక జేఎన్‌టీయూ జీవీలో ఇండో–యూరో సింక్రోనైజేషన్‌ ఆధ్వర్యంలో జర్మన్‌ భాష ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని, ఈ అవకాశాన్ని ఐటీఐ ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌ ఉత్తీర్ణులు సద్వినియోగం చేసుకోవాలని వర్సిటీ వీసీ వి.వి.సుబ్బారావు తెలిపారు. ఈ సందర్భంగా శిక్షణకు సంబంధించిన బ్రోచర్‌ను గురువారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉచిత జర్మన్‌ భాషా శిక్షణలో ఏ–2 లెవెల్‌ ఉత్తీర్ణత పొందిన వారికి జర్మనీ దేశంలో ఉద్యోగ అవకాశాలు పొందడానికి ఇండో–జర్మన్‌ సింక్రమైజేషన్‌ సంస్థ అవసరమైన సదుపాయాలు కల్పిస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రప్రథమంగా ఐటీఐలో ఎలక్ట్రికల్‌ ట్రేడ్‌ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులుకు శిక్షణ ఇస్తున్నట్టు పేర్కొన్నారు. విద్యార్థుల వయో పరిమితి 19 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలన్నారు. సుమారు 3 నెలలపాటు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో గాని, బ్రోచర్‌లోని క్యూఆర్‌కోడ్‌ స్కాన్‌చేసి దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జేఎన్‌టీయూ జీవీ ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ డి.రాజ్యలక్ష్మి, శిక్షణాధికారిణి వి.ఎస్‌.వకుళ, తదితరులు పాల్గొన్నారు.

తైక్వాండో పోటీల రిఫరీగా బొబ్బిలి క్రీడాకారుడు

బొబ్బిలి: తెలంగాణలోని మహబూబ్‌ నగర్‌ జిల్లాలో ఈ నెల 15 నుంచి మూడు రోజుల పాటు జాతీయస్థాయి తైక్వాండో పోటీలు జరగనున్నవి. దీనికి బొబ్బిలికి చెందిన క్రీడాకారుడు బంగారి కిశోర్‌కుమార్‌ రిఫరీగా ఎంపికై నట్టు కోచ్‌ బి.ప్రసాద్‌ గురువారం తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement