తెర్లాం: సెల్‌ఫోన్ ఇవ్వలేదని మనస్థాపానికి గురైన ఇంటర్ విద్యార్థిని ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన తెర్లాం మండలం గోపాలవలస పంచాయతీ పరిధిలోని జగన్నాథవలస గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. మృతురాలి తల్లి, తెర్లాం ఎస్‌ఐ సాగర్‌బాబు తెలిపిన వివరాల ప్రకారం.. జగన్నాథవలస గ్రామానికి చెందిన గొందాల అనుష్క(16) ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఉత్తీర్ణత సాధించింది. తక్కువ మార్కులు రావడంతో బెటర్‌మెంట్‌కు ప్రిపరేషన్ అవుతోంది. ఉదయం చదువుకోడానికి సెల్‌ఫోన్ ఇవ్వాలని తల్లిదండ్రులు రాంకుమార్, హేమను అనుష్క అడిగింది. పొలం పనికి వెళ్తున్నామని, సెల్‌ఫోన్ తమవెంట తీసుకెళ్తున్నామని, పుస్తకాలు తీసి చదవమని చెప్పి వెళ్లిపోయారు. తన ప్రిపరేషన్ కోసం తల్లిదండ్రులను సెల్‌ఫోన్ అడిగినా ఇవ్వలేదన్న కారణంతో మనస్థాపానికి గురై ఇంట్లో ఉన్న ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పొలం పని నుంచి ఇంటికి వచ్చిన తల్లి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉన్న అనుష్కను చూసి కేకలు వేసింది. ఇరుగుపొరుగు వారు వచ్చి ఆమెను కిందకు దించి వెంటనే రాజాం సీహెచ్‌సీకి తరలించారు. అప్పటికే అనుష్క మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కుమార్తె మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తెర్లాం ఎస్‌ఐ సాగర్‌బాబు కేసు నమోదు చేశారు.


