రాజాం/గుర్ల: గతంలో మాదిరిగా ఎరువులు ఎక్కడ కావాలంటే అక్కడ..ఎప్పుడు కావాలంటే అప్పడు లభించే పరిస్థితి మారబోతోంది. ఆయా రైతు సేవా కేంద్రాలకు వచ్చే ఎరువులను రైతులు, భూములు లెక్క కట్టి ఇవ్వనున్నారు. ఈ విధానంలో పెద్ద రైతులకు, కౌలు రైతులకు గడ్డు పరిస్థితే. భూమిని సాగుచేసే రైతుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదుకాకుంటే ప్రభుత్వ కేంద్రాలే కాకుండా ప్రైవేట్ స్టోర్‌లలో సైతం ఎరువు లభించదు. ఇప్పటికే చాలా మంది రైతుల భూముల వివరాలు సక్రమంగా లేవు. రైతుకు సక్రమంగా ఎరువులు అందించేందుకు అమలుచేస్తున్న రైతు కార్డు ఆ రైతులకు పూర్తిస్థాయిలో ఎరువును సకాలంలో అందించగలదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
జిల్లాలో 2.70 లక్షల మంది రైతులు
జిల్లా వ్యాప్తంగా 52 లక్షల హెక్టార్లలో ప్రతి ఏడాదీ ఖరీఫ్ సాగు జరుగుతోంది. ఇందులో ఎక్కువ సాగు వరి పంటదే. వరి పంటకు సకాలంలో అందాల్సిన ఎరువును కూటమి ప్రభుత్వం గత రెండేళ్లుగా అందించలేకపోయింది. కొంతమంది రైతులు ఇతర రాష్ట్రాల నుంచి ఎరువులు తెప్పించుకున్నారు. ఒక్కో యూరియా బస్తాపై అదనంగా రూ.300 వరకూ చెల్లించారు. భారీగా ఎరువులకు పెట్టుబడులయ్యాయి. జిల్లాలో 2.70 లక్షల మంది రైతులు సాగుదారులుగా ఉన్నారు. వారికి రైతు కార్డులు అందించే ప్రక్రియను కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. రైతు కార్డు ఉండాలంటే భూమి వివరాలు సక్రమంగా ఉండాలి. ఈ వివరాలు సక్రమంగా లేని రైతులకు కార్డులు అందవు. జిల్లాలో సగానికిపైగా రైతులకు సంబంధించిన భూముల వివరాలు సక్రమంగా లేవు. దీంతో ఆయా రైతులకు సరిపడ వివరాలతో కూడిన కార్డులు అందే అవకాశం తక్కువగా ఉంది. ఈనెల 15 నుంచే అన్ని రైతు సేవా కేంద్రాల్లో రైతుల వివరాలు నమోదు చేసి, కార్డులు అందించనున్నారు. ఈ కార్డులు ఉన్న రైతులకు మాత్రమే ఎరువులు ఇస్తారు. కౌలు రైతులకు ఈ కార్డులు ప్రస్తుతం ఇవ్వడం లేదు. అంటే కౌలు రైతుకు రానున్న ఖరీఫ్‌లో ఒక్క బస్తా ఎరువు కూడా లభించని దుస్థితి కనిపిస్తోంది.
పరిమితంగానే..
రసాయన ఎరువుల కొరతను అధిగమించేందుకు వ్యవసాయశాఖ ఈ విధానం అవలంబిస్తున్నప్పటికీ రైతులకు సకాలంలో ఎరువులు అందడం ప్రశ్నార్థకంగా మారుతోంది. కొంతమంది రైతుల వివరాలు కార్డుల్లో నమోదు కాకపోయినా, ఆయా రైతు సేవా కేంద్రాలకు ఎరువు సక్రమంగా రాకపోయినా, వచ్చిన ఎరువు తక్కువైనా రైతులకు ఇబ్బందులు తప్పవు. వచ్చిన ఎరువునే మొత్తం రైతులు సర్దుకోవాలి. ఈ నిబంధనలతో కొంతమంది రైతులకు ఎటూ చాలని ఎరువుతో వ్యవసాయం కష్టతరంగా మారనుంది.
ఎక్కడెక్కడ ఇస్తారు
రైతు కార్డు ఆధారంగా ఎరువును రైతు సేవా కేంద్రాలు, పీఏసీఎస్ కేంద్రాలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఫెర్టిలైజర్స్ దుకాణాల్లో అందిస్తారు. ఎక్కడ రైతు ఎరువు పొందాలన్నా కార్డులు ఉండాలి. ఆ భూమికి సరిపడ ఎరువులో తొలుత 30 శాతం, తరువాత 30 శాతం, తరువాత 40 శాతం ఇలా ఇస్తారు. కేవలం పరిమితితో ఇచ్చే ఈ ఎరువు సకాలంలో అందకపోయినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు.
కౌలు రైతుకు కష్టమే
కౌలు రైతులకు ప్రస్తుతం రైతు కార్డులు ఇవ్వడం లేదు. కౌలుకు పంటపొలాలు తీసుకున్న రైతులకు ఎరువు కష్టంగా మారనుంది. అసలైన భూ యజమాని పేరున రైతు కార్డులు వస్తాయి. ఆ యజమానికి మాత్రమే ఎరువులు ఇస్తారు. ఈ రైతు కార్డు వచ్చిన తరువాత కౌలు రైతులకు పంట రుణాలు సైతం మాయం కానున్నాయి.
అసలైన రైతులకు ఎరువు కార్డుల పంపిణీ
ఈ కార్డు ఆధారంగానే ఎరువుల సరఫరా
గతంలో మాదిరిగా అదనపు ఎరువులు కట్
నేటి నుంచే కార్డుల జారీ
భూమి వివరాలు సక్రమంగా లేకుంటే ఇబ్బందే
రైతు కార్డులో
ఏముంటాయంటే..
రైతు పేరు
రైతు ఐడీ,
భూమి వివరాలు
పంట వివరాలు
అవసరమైన ఎరువులు


