జిందాల్‌ అవకతవకలకు నేతలే కారణం | - | Sakshi
Sakshi News home page

జిందాల్‌ అవకతవకలకు నేతలే కారణం

May 15 2026 12:37 PM | Updated on May 15 2026 12:37 PM

జిందాల్‌ అవకతవకలకు నేతలే కారణం

శృంగవరపుకోట: జిందాల్‌లో అవకతవకలకు నేతలే కారణమని, జిందాల్‌ పేరు చెప్పి పేదల భూములు లాక్కుని మోసం చేశారని సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన స్థానిక సీపీఎం నేతలతో కలిసి జిందాల్‌ అవకతవకలపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మా భూములు లాక్కుని మాకు ఇచ్చిన పరిహారాన్ని ఎమ్మెల్సీ అనుచరులు తినేశారంటూ పీజీఆర్‌ఎస్‌లో బాధితులు ఫిర్యాదు చేయడం సిగ్గుచేటన్నారు. నాడు జిందాల్‌కు భూములిచ్చింది మొదలు నేటివరకూ అవకతవకలు జరుగుతూనే ఉన్నాయన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నోళ్లు, గతంలో అధికారం వెలగబెట్టిన వారంతా అవకతవకలకు పాల్పడ్డారన్నారు., కంపెనీకి భూములివ్వొద్దని నాడే సీపీఎం చెప్పిందని, 18యేళ్లయినా కంపెనీ పెట్టలేదని, ఆరేళ్లలోగా కంపెనీ పెట్టకుంటే భూములు వెనక్కి ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఉందని, చట్టప్రకారం నాడు పశ్ఛిమబెంగాల్‌లో అధికారంలో ఉన్న సీపీఎం నందిగ్రామ్‌ భూములు వెనక్కి ఇచ్చిందని గుర్తు చేశారు. ఇక్కడ 250రోజులుగా భూముల్ని బాధితులకు ఇవ్వాలని ఉద్యమం సాగుతుండగా, 27ఎకరాల భూములు తీసుకుని, పరిహారం చెల్లింపుల్లో నాయకులు, అధికారులు అవకతవకలకు పాల్పడి, అడిగితే బెదిరింపులకు దిగుతున్నారన్నారు. కల్టెక్టర్‌ కొత్త అయినా అధికారులు అంతా పాతవారేనన్నారు. గతంలో బినామీలు జిందాల్‌ సొమ్ములు స్వాహా చేశారని ఫిర్యాదు చేసిన ఒక పార్టీనేత ముడుపులు ముట్టడంతో తర్వాత మాట్లాడలేదన్నారు. బినామీ పేర్లతో గిరిజనుల సొమ్ము కాజేసిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, లేకుంటే జిందాల్‌ నిర్వాసితులతో కలిసి కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. కార్యకన్రమంలో సీపీఎం మండల కార్యదర్శి మద్దిల రమణ, చెలికాని ముత్యాలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement