గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో ఆ పార్టీ తరఫున ఎన్నికై న పాలకవర్గాలు అధికారంలో ఉన్న మున్సిపాలిటీలు, నగర పంచాయతీలను ఎగరేసుకు పోవడంలో పెట్టిన శ్రద్ధ మున్సిపాలిటీల్లో అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించలేదు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతోంది. ఎమ్మెల్యేల ఒత్తిళ్లకు మున్సిపల్ అధికారులూ తలొగ్గాల్సి వస్తోంది. ఫలితంగా రాజకీయ కక్షసాధింపులతో వైఎస్సార్‌సీపీ పాలక వర్గాలున్నచోట..అభివృద్ధి పనులకు బ్రేకులు పడ్డాయి. ప్రొటోకాల్ పక్కకు వెళ్లిపోయింది. పురపాలక సంఘ చైర్‌పర్సన్‌లు డమ్మీలుగా మిగిలిపోయారు. గతంలో పార్వతీపురం, పాలకొండ వంటి చోట్ల పాత పాలకవర్గాల తొలగింపునకు పెద్ద డ్రామానే నడిచింది.
సాక్షి, పార్వతీపురం మన్యం:
పార్వతీపురం పురపాలక సంఘం ప్రత్యేకాధికారి, కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే విజయ్‌చంద్రతో కలిసి మంగళవారం మున్సిపాలిటీలో ‘ముఖాముఖి’ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి వివిధ సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించడం దీని ప్రధాన ఉద్దేశం. అధిక భాగం సమస్యలను అప్పట్లో వైఎస్సార్‌సీపీలో ఉండి..ప్లేటు తిప్పేసిన ‘ఫిరాయింపు’ కౌన్సిలర్లే తీసుకురావడం గమనార్హం. పారిశుద్ధ్యం, తాగునీటి సమస్య, రహదారులు, కాలువల నిర్మాణం వంటి అంశాలను ‘దగ్గరుండి’ నిలదీయించారు. దీని వెనుక మరో ‘బలమైన’ కారణం’ ఉందన్న అనుమానాలను కలిగించారు. గత ప్రభుత్వం హయాంలో ఏమీ చేయలేదని చూపించడం ఒకటైతే.. ప్రత్యేకాధికారిగా కలెక్టర్ వచ్చిన రెండు నెలల్లో ఏమీ సాధించలేకపోయారని విమర్శించడం మరో ఎత్తుగడలా కనిపించింది. ఈ సమస్యలపై ఏ రోజూ వీరు ప్రత్యేకాధికారిని కలిసి విన్నవించిన దాఖలాలు లేవు. కమిషనర్ దృష్టిలోనూ పెట్టిన పరిస్థితి లేదు. ‘ముఖాముఖి’ సమయానికి అప్పటికప్పుడు ప్రణాళిక సిద్ధం చేసుకుని వచ్చారన్న భావన కలిగించారు. ‘కలెక్టర్ చెబితే గానీ ఏ పనీ మున్సిపల్ అధికారులు చేయరంట?’ అని బంతిని కలెక్టర్ ప్రభాకరరెడ్డి కోర్టులోకి నెట్టేశారు. తెర వెనుక నడిపిస్తున్న నాయకుడి ‘అంతిమ లక్ష్యం’ ఇదే కాబోలు! అందుకే కలెక్టర్ ప్రభాకరరెడ్డి కూడా ఒకింత అసహనానికి లోనయ్యారు. తమాషాలు చేస్తున్నారా? అంటూ కొంతమంది సిబ్బందిని ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో పార్వతీపురం మున్సిపల్ పాలకవర్గ సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయ్‌చంద్ర మోకాలడ్డారన్నది అందరికీ తెలిసిన విషయమే.
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఏడాది కాలంలో పార్వతీపురం పురపాలక సంఘం పాలక వర్గ సమావేశాలు నిర్వహించిన దాఖలాలు లేవు. ఎన్నిసార్లు సమావేశాలు పెట్టాలని అప్పటి కమిషనర్‌ను నాటి చైర్‌పర్సన్ బోను గౌరీశ్వరి అడిగినా.. ఆయన ‘విధేయత’ తప్పలేదు. సమావేశాలు నిర్వహించలేదు. నలువైపుల నుంచీ విమర్శలు ఎక్కువైన నేపథ్యంలో ఎజెండాను మార్చి, రాత్రి 11 గంటల సమయంలో చిరుద్యోగులతో చైర్‌పర్సన్ సంతకం కోసం పంపించారు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో.. మరుసటి రోజు సమావేశాన్ని పెట్టి, రాద్ధాంతం చేసి అర్ధాంతరంగా ముగించేశారు. తర్వాత జరిగిన సమావేశాల్లోనూ ముందస్తుగా భారీ పోలీసు బందోబస్తును ప్రణాళిక ప్రకారం తీసుకొచ్చి, రచ్చ చేయించారు. ఇలా అభివృద్ధి కోసం చర్చించాల్సిన సమావేశాలను వివాదాలతో రణరంగంగా మార్చారు. చైర్‌పర్సన్‌కు ఇవ్వాల్సిన ప్రోటోకాల్‌ను సైతం తుంగలో తొక్కేశారు. ఇందుకు మున్సిపల్ అధికారులు సైతం సహకరించడం గమనార్హం.
గత ప్రభుత్వ హయాంలో ఏమీ చేయలేదన్న ప్రచారాన్ని తెరపైకి తెచ్చేందుకు అప్పటికే మంజూరైన పనులను సైతం మధ్యలోనే నిలిపివేయించారు. 7,8,9 వార్డుల్లో కాలువలు, సీసీ రహదారుల పనులకు చైర్‌పర్సన్‌తో సంబంధం లేకుండా కొబ్బరికాయ కొట్టేశారు. ఇప్పటికీ వాటిని పూర్తి చేయలేకపోయారు. ఎనిమిదో వార్డులో టెండర్
పూర్తయిన రెండు పనులను రద్దు చేసేశారు. తాగునీటి సమస్య పరిష్కారానికి గత పాలక వర్గ హయాంలో రూ.63 కోట్ల వ్యయంతో పనులు మంజూరు చేయించారు. పనులు ప్రారంభించి, తోటపల్లి వద్ద పైప్‌లైన్లు కూడా వేసి, మధ్యలోనే కాంట్రాక్టర్ వదిలేశారు. ఆ పనులకు సంబంధించిన శిలాఫలకం కూడా మున్సిపల్ కార్యాలయం వద్ద ఇటీవల తొలగించడం గమనార్హం. ఫలితంగానే తీవ్ర నీటి ఎద్దడిని పుర ప్రజలు ఎదుర్కొంటున్నారు. సాధారణ నిధులతో కొన్ని పనులు చేయాల్సి ఉన్నా.. కాంట్రాక్టర్లను రానీయకుండా చేశారు. డ్రైన్లు, రోడ్ల కోసం రూ.3 కోట్ల వరకూ మంజూరు చేయించినా..ఫలితం లేకపోయింది. వీధి దీపాల నిర్వహణ, స్తంభాలు వంటి పనుల కోసం ఏడాది కాలానికి రూ.20 లక్షల ముందస్తు నిధులకు గత పాలకవర్గం అనుమతిచ్చినా..వాటితో అరొకర పనులే చేయిస్తున్నారు. కాలువల్లో పూడికలు తీయడానికి పురపాలక సంఘం ఏటా రూ.30 లక్షలు ఖర్చు చేస్తోంది. అరకొర పనులు చేసి, చేతులు దులుపుకున్నారు. ఇలా అడుగడుగునా అభివృద్ధికి అవరోధంగా మారి.. తప్పును గత పాలకవర్గం, నాటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై నెట్టేయాలని చూస్తున్నారు. ఇప్పుడు ప్రత్యేకాధికారిగా ఉన్న కలెక్టర్ మీద ఉన్న ‘వ్యక్తిగత’ కక్షను ఇటువైపు మళ్లిస్తున్నారు. వాస్తవానికి ప్రత్యేకాధికారిగా తన మార్కు ను చూపించాలని పురపాలక సంఘంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. పారిశుద్ధ్యం మెరుగుకు కృషి చేస్తున్నారు. స్వచ్ఛ పార్వతీపురం దిశగా అడుగులు వేయిస్తున్నారు. అందుకూ అధికార పార్టీకి చెందిన వారే అడ్డుపడుతుండడం బహుశా పార్వతీపురం నియోజకవర్గానికే చెల్లుతుంది.
స్వచ్ఛ పార్వతీపురం కోసం సూచనలు చేస్తున్న ప్రత్యేకాధికారి, కలెక్టర్ ప్రభాకరరెడ్డి(ఫైల్)


