జయ, విజయ విగ్రహాల ప్రతిష్ట | - | Sakshi
Sakshi News home page

జయ, విజయ విగ్రహాల ప్రతిష్ట

May 14 2026 12:19 AM | Updated on May 14 2026 12:19 AM

జయ, విజయ విగ్రహాల ప్రతిష్ట కోటదుర్గమ్మ హుండీల ఆదాయం లెక్కింపు గురుకుల ప్రవేశ పరీక్షలో కిర్ల విద్యార్థికి ఫస్ట్‌ ర్యాంకు

పాలకొండ: పట్టణంలో వెలసిన అతి పురాతన జగన్నాథస్వామి ఆలయంలో జయ,విజయ విగ్రహాలను బుధవారం ప్రతిష్టించారు. పట్టాణానికి చెందిన దుర్గాప్రసాద్‌ సాహు జ్ఞాపకార్థం ఆయన కుమారులు ఈ విగ్రహాలను ఆలయానికి అందించి ప్రతిష్ట చేయించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు విశ్వనాథందాస్‌, చక్రీదాస్‌, భక్తులు పాల్గొన్నారు.

పాలకొండ: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పాలకొండ కోటదుర్గమ్మ ఆలయంలోని హుండీల ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. ఆలయంలో ఉన్న ఎనిమిది హుండీల్లో ఈ ఏడాది మార్చి 25 నుంచి మే 13 వరకు ఏభై రోజులకు గాను రూ.6,73,482లు ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ బీఎన్‌ఎస్‌ సూర్యనారాయణ తెలిపారు.అలాగే 15 గ్రాముల మిక్స్‌డ్‌ బంగా రం, 550 గ్రాముల మిక్స్‌డ్‌ వెండి కానుకలుగా లభించాయని చెప్పారు. దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.రామారావు పర్యవేక్షణలో హుండీ ల ఆదాయం లెక్కింపు జరిగింది. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది, పోలీసులు, ఏపీజీవీబీ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

మాతృ, శిశు మరణాలు నివారించేది ఎప్పుడు?

● వైద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తంచేసిన కలెక్టర్‌ రాంసుందర్‌రెడ్డి

విజయనగరం ఫోర్ట్‌: జిల్లాలో మాతృ, శిశు మరణాలు సంభవించడంపై కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి సీరియస్‌ అయ్యారు. మాతృమరణాలపై కలెక్టరేట్‌లో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో మాతృ, శిశు మరణాలు సంభవిస్తుంటే జిల్లా యంత్రాంగం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాల రక్షణ కోసం ప్రభుత్వ యంత్రాంగం ఉందని, విధుల్లో సిబ్బంది నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే సహించేంది లేదని హెచ్చరించారు. మార్చి నెలలో సంభవించిన రెండు మాతృ మరణాల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం కనిపిస్తోందని, బాధ్యులపై సమగ్ర నివేదిక సమర్పించాలని డీఎంహెచ్‌ఓ జీవనరాణిని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో ఆశ కార్యకర్తలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, గర్భిణులు, బాలంతల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. సమావేశంలో డీసీహెచ్‌ఎస్‌ పద్మశ్రీ రాణి, గైనికాలజీ హెచ్‌ఓడీ అరుణ శుభశ్రీ, డీఐఓ అచ్చుతకుమారి, తదితరులు పాల్గొన్నారు.

21 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

విజయనగరం అర్బన్‌: జిల్లాలో ఈ నెల 21 నుంచి ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధంచేసినట్లు జాయింట్‌ కలెక్టర్‌ సేతుమాధవన్‌ తెలిపారు. కలెక్టరేట్‌ సమావేశ మందింరంలో జిల్లా పరీక్షల కమిటీ కన్వీనర్‌ ఎస్‌.తవిటినాయుడుతో కలిసి పోలీస్‌, వైద్య, విద్యుత్‌, ఆరోగ్య, రవాణా తదితర శాఖల అధికారులతో బుధవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణపై కీలక సూచనలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 49 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఉదయం సెషన్‌ 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్‌ 2.30 నుంచి 5.30 గంటల వరకు జరుగుతాయన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్‌ సరఫరా, విద్యార్థులకు రవాణా సౌకర్యాలు, వైద్య సహాయం, బందోబస్తు సదుపాయం కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

జామి: విజయనగరం జిల్లా జామి మండలంలోని కిర్ల గ్రామానికి చెందిన ఆకాష్‌రెడ్డి అనే విద్యార్థి ఏపీ రెసిడెన్షియల్‌ ఆరోతరగతి ప్రవేశ పరీక్ష ఫలితాల్లో రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించాడు. 100కు 97 మార్కులు సాధించి ముందంజలో నిలిచాడు. కిర్ల ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదివిన అకాష్‌రెడ్డి అంబేడ్కర్‌ గురుకుల ప్రవేశ పరీక్షలోనూ రాష్ట్రస్థాయిలో 8వ ర్యాంకు సాధించాడు. ఏపీ మోడల్‌ స్కూల్‌ పరీక్షల్లోనూ కొత్తవలస మండల స్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు.

Advertisement
 
Advertisement
Advertisement