● వరికి క్వింటాకు రూ.72 పెంపు ● మద్దతు ధరలను ప్రకటించిన కేంద్రం
సాక్షి, పార్వతీపురం మన్యం:
ప్రధాన పంట వరిని పండించే రైతులకు కేంద్రం ఊరట కలిగించింది. 2026–27 ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరకు బుధవారం ఆమోదం తెలిపింది. మొత్తంగా 14 పంటలకు ప్రకటించగా.. అత్యధికంగా పండించే సాధారణ రకం వరి మద్దతు ధరను క్వింటాకు రూ.72 పెంచి, రూ. 2,441 కు చేర్చారు. గ్రేడ్–ఏ రకం వరి ధరను రూ.2,461గా నిర్ణయించారు. క్వింటాలు జొన్నలు(హైబ్రిడ్) కనీస మద్దతు ధర రూ. 4,023గా చేశారు.
పేరుకే మద్దతు..
జిల్లాలో వరి ప్రధాన పంటగా ఉంది. దాదాపు రెండు లక్షల మందికిపైగా రైతులు సాగే జీవనాధారంగా బతుకుతున్నారు. వరి తర్వాత స్థానంలో మొక్కజొన్న, పత్తి వంటి పంటలను సాగు చేస్తున్నారు. ఖరీఫ్ పంటపైనే రైతులు ఆధారపడతారు. జిల్లాలో ఖరీఫ్ 2025–26 సీజన్ కు సంబంధించి 281 రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వం 2.68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. మొత్తం రూ.617 కోట్లను 42 వేల మందికి పైగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి ఏటా కేంద్రం మద్దతు ధర ప్రకటిస్తున్నా.. పెరుగుతున్న సాగు ఖర్చులకు ఆ మొత్తం ఎటూ చాలడం లేదని రైతు సంఘం నాయకులు చెబుతున్నారు. ఇస్తున్న ‘మద్దతు’ కూడా దళారులకే దక్కుతోంది. ధాన్యం చేతికి అంది వచ్చినా.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు తెరవని పరిస్థితి ఉంది. విధి లేక, పంటను దాచుకునే వెసులుబాటు దొరక్క.. మధ్యవర్తులు, వ్యాపారులనే రైతులు ఆశ్రయిస్తున్నారు. బస్తా రూ.1,400 నుంచి రూ.1,500 మధ్యలోనే వారు కొనుగోలు చేస్తున్నా రు. ఈలోగా ప్రకృతి అనుకూలించకపోతే అన్నదాత లు మరింతగా నష్టపోతున్నారు. ఇక మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలు ఎక్కడా తెరవడం లేదు. పత్తికి కూడా మద్దతు లభించడం లేదు.


