ఎన్నాళ్లో వేచిన కల..! | - | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లో వేచిన కల..!

May 14 2026 12:19 AM | Updated on May 14 2026 12:19 AM

ఎన్నాళ్లో వేచిన కల..! ● సువర్ణముఖిపై వంతెనకు రూ.9 కోట్లు విడుదల ● పీఆర్‌ (ప్రాజెక్ట్‌స్‌) ఏఈ శంకరరావు

● సువర్ణముఖిపై వంతెనకు రూ.9 కోట్లు విడుదల ● పీఆర్‌ (ప్రాజెక్ట్‌స్‌) ఏఈ శంకరరావు

సీతానగరం:

మండలంలోని బూర్జ వద్ద సువర్ణముఖినదిపై వంతెన నిర్మాణానికి రాష్ట్రప్రభుత్వం నిధులు విడుదల చేసినట్లు పీఆర్‌ (ప్రాజెక్ట్‌స్‌) ఏఈ శంకరరావు తెలిపారు. దీంతో దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న కల అప్పటి ఎమ్మెల్యే అలజంగి జోగారావు కృషితో నేటికి సార్థకమైంది. జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం 2023 అక్టోబరు నెలలో సువర్ణముఖినదిపై బూర్జ–చినంకలాం, గాదెలవలస గ్రామాల మధ్య వంతెన నిర్మాణానికి జీఓ విడుదలచేస్తూ రూ.9 కోట్లు నిధులు మంజూరు చేసింది. అప్పట్లో ఉత్తర్వులు వెలువడడం వల్ల బూర్జ చుట్టుపక్కల 50గ్రామాల ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. దీంతో దీర్ఘకాలంగా పలుగ్రామాల ప్రజలు ఎదురుచూస్తున్న వంతెన కల నాటి ఎమ్మెల్యే అలజంగి జోగారావు కృషి ఫలితంగా నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆశీస్సులతో నెరవేరింది. బూర్జ పంచాయతీలో సువర్ణముఖి నదికి అవతల ఆవాలవలస, బూర్జగ్రామానికి చెందిన రైతులకు ఆవాలవలసను ఆనుకుని వ్యవసాయ భూములున్న రైతులు, ఆవాలవలస గ్రామస్తులకు నిత్యావసర సరుకులు కావాలన్నా, పంచాయతీ పనులకోసం వచ్చేందుకు వేసవిలో అయితే 30 నిమిషాల్లో ఇంటికి చేరే రైతులు, ప్రజలు వర్షాకాలంలో నదిలో దిగడానికి వీలుకాని పరిస్థితిలో 16 కిలోమీటర్ల దూరం తిరిగి రావాల్సి ఉంటుంది. అప్పట్లో పనులు ప్రారంభించడానికి 2024 సార్వత్రిక ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడం వల్ల నదిలో స్తంభాల నిర్మాణానికి బోర్లు తీయడంతోనే పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో త్వరలో భూమి పూజ చేసి పనులను ప్రారంభించడానికి సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ప్రస్తుత పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సూచించడంతో అధికారులు ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ నెల 18న అవే పనులకు భూమి పూజ చేయడానికి సమాయత్తం అవుతున్నట్లు స్థానిక పెద్దల ద్వారా తెలియవచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement