● స్థానిక ఎన్నికల నేపథ్యంలో అలెర్ట్‌గా ఉండాలి
● ఎస్పీ ఏ ఆర్ దామోదర్ ఆదేశాలు
● డీపీఓలో నేర సమీక్షా సమావేశం
విజయనగరం క్రైమ్: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై నిరంతరం నిఘా పెట్టాలని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై పీడీ యాక్ట్‌ను ప్రయోగించాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. ఈ మేరకు జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో పనిచేస్తున్న పోలీసు అధికారులతో డీపీఓలో బుధవారం ఎస్పీ దామోదర్ నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దర్యాప్తులో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్, ఎన్‌డీపీసీ, పోక్సో, అట్రాసిటీ, మిస్సింగ్, చోరీ, రోడ్డు ప్రమాదాలు, సోషల్ మీడియా కేసులను సమీక్షించి, అధికారులకు పలు సూచనలు చేశారు. సమీక్షలో ఎస్పీ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో గ్రామ, వార్డు సందర్శనలు చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అంశాలను ప్రాథమిక స్థాయిలో గుర్తించి, వాటిని పరిష్కరించాలని ఆదేశించారు.
మంచి ప్రవర్తన కోసం బైండోవర్ చేయాలి
గ్రామాలు, వార్డుల్లో అల్లర్లు సష్టించేందుకు అవకాశం ఉన్న వ్యక్తులను ముందుగా గుర్తించి, మంచి ప్రవర్తన కోసం వారిని బైండోవర్ చేయాలని స్పష్టం చేశారు. హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తులపై నిఘా పెట్టాలని, వారి కదలికలను గమనించాలని, అవసరమైతే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు చేపట్టాలని చెప్పారు. ప్రతిపోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలు జరిగేందుకు అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగా గుర్తించి, ఆయా ప్రాంతాల్లో నేరాలు జరగకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. అపార్ట్‌మెంట్లు, వ్యాణిజ్య సముదాయలు, వ్యాపారులు, కాలనీ వాసులకు సీసీ కెమెరాల ప్రాధాన్యతను వివరించి, ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పోలీస్‌సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని, అవసరమైన మౌలిక వసతులను కల్పించాలని అధికారులకు ఎస్పీ సూచించారు.
ఎంఎస్‌పీల సహకారం తీసుకోవాలి
టెక్నాలజీని వినియోగించుకుని కేసుల మిస్టరీని ఛేదించాలని తెలిపారు. ప్రజలకు నిత్యం పోలీసులు అందుబాటులో ఉంటూ సేవలను విస్తృతం చేయాలని కోరారు. క్షేత్రస్థాయిలో సమాచార సేకరణకు, ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాల్లో ఆయా గ్రామాల దత్తత కానిస్టేబుళ్లు, మహిళా సంరక్షణ పోలీసుల (ఎంఎస్‌పీ) సేవలను వినియోగించుకోవాలని అధికారులకు ఎస్పీ సూచించారు. దర్యాప్తు చేపట్టే అన్ని కేసుల్లోను ఈ–సాక్ష్య యాప్‌ను వినియోగించాలని, ఫొటోలను, వీడియోలను ఈ–సాక్ష్యలో నిక్షిప్తం చేయాలన్నారు. కొత్త క్రిమినల్ చట్టాలకు అనుగుణంగా గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల్లో అభియోగ పత్రాలను నిర్దిష్ట సమయంలోగా ఆయా న్యాయస్థానాల్లో దాఖలు చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీఎస్పీలు ఆర్.గోవిందరావు, ఎస్.రాఘవులు, ఎం.వీరకుమార్, న్యాయ సలహాదారులు వై.పరశురాం, సీఐలు చౌదరి, శ్రీనివాస్, లక్ష్మణరావులతో పాటు 32 స్టేషన్‌ల ఎస్సైలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


