అంతరిక్షంలోకి దూసుకెళ్తున్న స్టార్టప్‌ | - | Sakshi
Sakshi News home page

అంతరిక్షంలోకి దూసుకెళ్తున్న స్టార్టప్‌

May 14 2026 12:19 AM | Updated on May 14 2026 12:19 AM

అంతరిక్షంలోకి దూసుకెళ్తున్న స్టార్టప్‌

విజయనగరం అర్బన్‌: చిన్న ఆలోచనతో మొదలైన ప్రయాణం.. ఇప్పుడు అంతరిక్ష సాంకేతిక రంగంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దిశగా దూసుకెళ్తోంది. విజయనగరం పట్టణానికి చెందిన యువ ఇంజినీర్‌, స్టార్టప్‌ వ్యవస్థాపకుడు దేవగుప్తపు ప్రకాశ్‌ నవదీప్‌ తన కలను సాకారం చేస్తూ స్థాపించిన రౌద్రనెక్స్‌ స్పేస్‌ టెక్నాలజీస్‌ ప్రస్తుతం స్పేస్‌ ప్రొపల్షన్‌ టెక్నాలజీలో కీలక ముందడుగు వేస్తోంది. సమీప అంతరిక్ష కార్యకలాపాల నుంచి దీప్‌ స్పేస్‌ మిషన్స్‌ వరకు ఉపయోగపడే అధునాతన ప్రొపల్షన్‌ వ్యవస్థలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ స్టార్టప్‌ ప్రయాణం ప్రారంభమైంది. పరిమిత వనరులు, సాంకేతిక సవాళ్లు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ యువ బృందం వెనుకడుగు వేయలేదు. ప్రస్తుతం సంస్థ విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్‌ ఇన్నోవేషన్‌ సొసైటీ (ఏపీఐఎస్‌)లో ఇన్క్యుబేట్‌ అవుతోంది. రాష్ట్రం నుంచి అంతరిక్ష సాంకేతికతను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ఈ సంస్థ పూర్తి స్వదేశీ టెక్నాలజీపై దృష్టి పెట్టడం విశేషం. ఇటీవల రెడ్‌ బెలూన్‌ ఏరోస్పేస్‌తో కలిసి నిర్వహించిన టెథర్డ్‌ లాంచ్‌ పరీక్షలో రౌద్రనెక్స్‌ అభివృద్ధి చేసిన ప్రొపల్షన్‌ పేలోడ్‌ విజయవంతంగా ఫ్‌లైట్‌ రెడీనెస్‌ను పూర్తి చేసింది. పేలోడ్‌లోని అన్ని సబ్‌సిస్టమ్స్‌ సమర్థవంతంగా పనిచేయడం సంస్థకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. ఈ నెలలో జరగనున్న భారత దేశపు తొలి సూపర్‌ ప్రెజర్‌ బెలూప్‌ లాంచ్‌లో భాగంగా రౌద్రనెక్స్‌ తన పేలోడ్‌ను స్ట్రోటోస్పియర్‌లోకి పంపించనుంది. ఇందులో ప్రపంచంలోనే తొలి ‘ఎయిర్‌ బ్రీతింగ్‌ కోల్డ్‌ స్లాస్మా ప్రొపల్షన్‌ సిస్టమ్‌’ ప్రయోగాత్మకంగా పరీక్షించనుండడం విశేషం. సంస్థ సహ వవ్యవస్థాపకుడు, సీఈఓ ప్రకాష్‌ నవదీప్‌ మాట్లాడుతూ ‘భారత దేశం నుంచి ప్రపంచ స్థాయి స్పేస్‌ టెక్నాలజీని అభివృద్ధి చేయాలన్నదే మాలక్ష్యమన్నారు. ఈ మిషన్‌ ద్వారా వచ్చే డేటా భవిష్యత్‌ ఉపగ్రహ వ్యవస్థలు, ఆల్ట్రాలో ఎర్త్‌ ఆర్పిట్‌, దీప్‌ స్పేస్‌ మిషన్స్‌కు ఉపయోగపడే తదుపరి తరం ప్రొపల్షన్‌ టెక్నాలజీలకు దోహదపడుతుందని చెప్పారు. ఏరో స్పేస్‌ ఇంజినీరింగ్‌ చదివిన నవదీప్‌ తండ్రి డీవీ రవిశంకర్‌ రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో సీఎస్‌డీటీగా పనిచేస్తున్నారు. తల్లి శారదా స్రవంతి గృహిణి. సాధారణ యుకుడిగా ప్రారంభమైన ప్రయాణం..ఇప్పడు అంతరిక్ష రంగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రతిభను ప్రపంచానికి చాటే స్థాయికి చేరుకోవడం యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

‘రౌద్ర నెక్స్‌’తో స్పేస్‌ టెక్నాలజీలో కొత్త అధ్యాయం

ప్రొపల్షన్‌ పేలోడ్‌ ఫ్‌లైట్‌ రెడీనెస్‌

పరీక్షలు విజయవంతం

నెరవేరిన పట్టణ విజయనగరం

యువకుడి కల

Advertisement
 
Advertisement
Advertisement