లైంగికంగా వేధిస్తే కనీసం 20 ఏళ్ల జైలుశిక్ష | - | Sakshi
Sakshi News home page

లైంగికంగా వేధిస్తే కనీసం 20 ఏళ్ల జైలుశిక్ష

May 14 2026 12:19 AM | Updated on May 14 2026 12:19 AM

లైంగికంగా వేధిస్తే కనీసం 20 ఏళ్ల జైలుశిక్ష

విజయనగరం లీగల్‌: లైంగికంగా బాలబాలికలను వేధించినా, అవమాన పరిచినా నేరం చేసిన వ్యక్తికి కనీసంగా 20 సంవత్సరాలు, గరిష్టంగా జీవిత ఖైదు శిక్షకు గురి కానున్నట్లు సీనియర్‌ సివిల్‌ జడ్జి, జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి డాక్టర్‌ ఎ.కృష్ణప్రసాద్‌ అన్నారు. ఈ మేరకు బుధవారం విజయనగరం మండలంలోని పాఠశాలలో నిర్వహించిన న్యాయ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బాలికలకు దగ్గరి వారి నుంచి ముప్పు పొంచి ఉందని, తెలిసిన వారే నేరానికి పాల్పడుతున్నారని వారినుంచి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా రక్షిత బాల్యం–సురక్షిత భవిష్యత్తు అనే నినాదంతో పోక్సో–2012 చట్టంపై, అవగాహన కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయమని వచ్చిన ఆదేశాల మేరకు విజయనగరంలో కూడా నిర్వహించినట్లు తెలిపారు. తల్లిదండ్రులు వారి పిల్లలపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుడ్‌టచ్‌, బ్యాడ్‌టచ్‌ గురించి బాలికలకు తెలియజేశారు. ప్రస్తుత పిల్లలు తెలిసీతెలియని టీనేజ్‌ వయస్సులో లేనిపోని ఆకర్షణలకు గురవుతున్నారని, మొబైల్‌ ఫోన్‌, ఇంటర్‌నెట్‌ ప్రభావాలకు లోనుకాకుండా విద్యపై దృష్టి సారించాలని హితవు పలికారు. ఏ విషయాన్నైనా నిర్భయంగా తల్లిదండ్రులకు లేదా పాఠశాల ఉపాధ్యాయులకు చెప్పాలని, అపరిచిత వ్యక్తుల దగ్గర జాగ్రత్తగా ఉండాలని తెలియజేశారు. చైల్డ్‌ హెల్ప్‌ లైన్‌ టోల్‌ ఫ్రీ నంబర్‌ 1098కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చునని సూచించారు. అలాగే జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ టోల్‌ ఫ్రీ నంబర్‌ 15100కు ఫోన్‌ చేసి సహాయాన్ని కోరవచ్చని తెలియజేశారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు ఆనందరావు, పి.సత్యవతి, డిస్ట్రిక్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ బీహెచ్‌ లక్ష్మి, ప్యానల్‌ న్యాయవాది డాక్టర్‌ పైల కుమార్‌ నేచర్‌ స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్‌ జి.దుర్గ, పాఠశాల ప్రధాన అధ్యాపకురాలు రమణమ్మ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement