ఆకతాయిలకు ఎస్పీ వార్నింగ్‌ | - | Sakshi
Sakshi News home page

ఆకతాయిలకు ఎస్పీ వార్నింగ్‌

May 14 2026 12:19 AM | Updated on May 14 2026 12:19 AM

ఆకతాయిలకు ఎస్పీ వార్నింగ్‌

విజయనగరం క్రైమ్‌ : విజయనగరంలో నివాసముంటూ ఈవ్‌ టీజింగ్‌, పోకిరి వేషాలు వేసే ఆకతాయిలను ఎస్పీ దామోదర్‌ బుధవారం హెచ్చరించారు. నగరంలో సక్రమంగా ఉంటే ఉండాలని, లేకుంటే నగరం విడిచి వెళ్లిపోవాలన్నారు. నగరంలో 32 చోట్ల ఏక కాలంలో దాదాపు 200 మంది సిబ్బందితో నాకా బందీ నిర్వహించారు. ఈ ఆకస్మిక తనిఖీల్లో ఇన్సురెన్స్‌, సీ బుక్‌, ఆర్‌సీ, హెల్మెట్‌ తదితరమైనవి లేని దాదాపు 1200 వాహనాలకు జరిమానా విధించారు. సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఏడున్నర వరకు విస్తృతంగా తనిఖీలతో పాటు నాకా బందీ నిర్వహించారు. నగరంలోని కంటోన్మెంట్‌ రెల్లి వీధి రామమందిరం వద్ద గజపతినగరం సీఐ సన్యాసిరావుతో పాటు విజయనగరం వన్‌ టౌన్‌ ఎస్‌ఐ లీలావతి, ఏఎస్‌ఐ లక్ష్మణరావులు తమ సిబ్బందితో తనికీలు నిర్వహించారు. తనిఖీలను ఎస్పీ దామోదర్‌ పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ జొన్నగుడ్డిలో పావాడ హరనాధ్‌ హత్యతో నగరంలో అల్లరి మూకలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. సున్నితమైన ప్రాంతాలైన జొన్నగుడ్డి, లంకాపట్నం, శాంతినగర్‌, రెల్లివీధి, గంజిపేట వంటి ప్రదేశాల్లో నిఘా పెట్టామని తెలిపారు. ఇకపై ప్రతీ రోజు ఆయా ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ఆకతాయిలు వెకిలి చేష్టలకు ఫుల్‌స్టాప్‌ పెడతామన్నారు. లంకాపట్నంపై కూడా టు టౌన్‌ పోలీసులు దృష్టి పెట్టారన్నారు. చట్ట వ్యతిరేక చర్యలకు ఎవరూ పాల్పడినా ఉక్కుపాదం మోపుతామన్నారు. రహదారి భద్రత, గంజాయి విక్రయాలు, వినియోగం, అక్రమ రవాణ నియంత్రణకు విజయనగరం వన్‌ టౌన్‌, టు టౌన్‌, రూరల్‌ పోలీసుస్టేషన్ల పరిధిలో సమస్యలు సృష్టించే ఏడు ముఖ్య ప్రాంతాల్లో 32 పాయింట్లలో ఏక కాలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టామని వెల్లడించారు. ఈ తనికీల్లో 13 మంది సీఐలు, 43 మంది ఎస్‌ఐలు 600 మంది కానిస్టేబుళ్లు, హొంగార్డు పాల్గొనగా డీఎస్పీలు ఆకస్మిక తనిఖీలను పర్యవేక్షించినట్టు పేర్కొన్నారు. తనిఖీల్లో డీఎస్పీలు ఎస్‌.రాఘవులు, ఆర్‌.గోవిందరావు, ఎం.వీరకుమార్‌, ఎస్బీ సీఐ ఎ.వి.లీలారావు, సీఐలు ఆర్వీకే చౌదరి, శ్రీనివాస్‌, ఎస్‌ఐలు గణేష్‌, దుర్గాప్రసాద్‌, సాగర్‌, లక్ష్మీ ప్రసన్నకుమార్‌, లీలావతి, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement