డిప్యూటీ సీఎం కార్యక్రమానికి.. టీడీపీ నేతల ఝలక్‌ | - | Sakshi
Sakshi News home page

డిప్యూటీ సీఎం కార్యక్రమానికి.. టీడీపీ నేతల ఝలక్‌

Mar 26 2026 11:40 AM | Updated on Mar 26 2026 11:40 AM

నెల్లిమర్ల రూరల్‌: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో గిరిప్రదక్షిణ రోడ్డును డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించారు. దీనికి నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ నేతలు గైర్హాజరయ్యారు. ఈ ఘటనతో టీడీపీ–జనసేన మధ్య ఆదిపత్య పోరు, టీడీపీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. కార్యక్రమానికి విజయనగరం జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత, జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ వర్చువల్‌గా హాజరైనప్పటికీ నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మార్క్‌ఫెడ్‌ చైర్మెన్‌ కర్రోతు బంగార్రాజుతో సహా టీడీపీ కీలక నేతలు ఎవరూ హాజరుకాకపోవడం చర్చకు దారితీసింది. సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన టీడీపీ రాష్ట్ర పరిశీలకుడు సువ్వాడ రవిశేఖర్‌, పార్టీ నెల్లిమర్ల మండలాధ్యక్షుడు కడగల ఆనంద్‌, అధికార ప్రతినిధి గేదెల రాజారావు, తదితర కీలక నేతలు సైతం రామతీర్థం వరకు వచ్చి వెనుదిరగడం చర్చకు కారణమైంది. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులకు ఆహ్వానాలు పంపినప్పటికీ సీనియర్‌ నాయకులు హజరుకాకపోవడం గమనార్హం.

డెంకాడ టీడీపీలో అంతర్గత పోరు బహిర్గతం...

డెంకాడ జెడ్పీటీసీ మాజీ సభ్యుడు, టీడీపీ సీనియర్‌ నేత అప్పలనారాయణకు కార్యక్రమానికి ఆహ్వానం లేకపోవడమే అసంతృప్తికి దారితీసిందని ఆ పార్టీ కేడర్‌లో చర్చసాగుతోంది. అదే సమయంలో డెంకాడ మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖరరావుకు మాత్రమే ఆహ్వానం అందడం, ఆయనొక్కడే నియోజకవర్గ టీడీపీ తరఫున హాజరుకావడం మరింత రాజకీయ వేడికి దారితీసింది. ఈ పరిణామం కాస్తా టీడీపీ ఇన్‌చార్జి బంగార్రాజుకు చేరడంతో ఆయన చివరి నిముషంలో కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అదేబాటలో మిగిలిన నాయకులు కూడా ఈ కార్యక్రమాన్ని బహిష్కరించారు.

తొలి నుంచి అంటీముట్టనట్లు..

నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాల్గొనే ప్రభుత్వ కార్యక్రమాలకు టీడీపీ కీలక నాయకులు దూరంగా ఉంటూ వస్తున్నారు. కేవలం టీడీపీ మంత్రులు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొనే కార్యక్రమాలకు మాత్రమే హాజరవుతున్నారు. సాక్షాత్తు శ్రీరాముడి సాక్షిగా రామతీర్థం గిరిప్రదక్షిణ రోడ్డు ప్రారంభ కార్యక్రమాన్ని కూడా బహిష్కరించడం మరోసారి కూటమిలో విభేదాలు బహిర్గతమ య్యాయి. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే నెల్లిమర్ల నడిబొడ్డున ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా టీడీపీ నాయకులు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే తీరును ఖండిస్తూ అధిష్టానానికి బలమైన సంకేతాన్ని పంపించారు. అనంతరం అధిష్టానం ఇరుపక్షాలను కేంద్ర కార్యాలయానికి పిలిపించి బుజ్జగించినా క్షేత్ర స్థాయిలో సమసిపోలేదని తెలుస్తోంది.

రామతీర్థం గిరిప్రదక్షిణ రోడ్డు

ప్రారంభంలో రాజకీయ వేడి

టీడీపీ–జనసేన మధ్య ఆదిపత్య పోరు

టీడీపీలో అంతర్గత విభేదాలు బహిర్గతం

బాయ్‌కాట్‌ చేసిన నెల్లిమర్ల నియోజకవర్గ టీడీపీ కీలక నేతలు

సమావేశానికి వచ్చి రామతీర్థం కల్యాణవేదిక వద్ద ఉండిపోయిన టీడీపీ రాష్ట్ర పరిశీలకులు సువ్వాడ రవిశేఖర్‌, తదితరులు

సభలో పాల్గొన్న మహిళా సంఘాల సభ్యులు, ఉపాధి హామీ వేతనదారులు

జనసమీకరణకు అష్టకష్టాలు...

నియోజకవర్గ టీడీపీ కీలక నేతల సహకారం లేకపోవడంతో సమావేశానికి జనసమీకరణకు జనసేన నాయకులు ఇబ్బందులు పడ్డారు. వెలుగు, ఉపాధి హామీ శాఖలపై బాధ్యతలు వేయడంతో వారు గ్రామాల నుంచి మహిళ సంఘాల సభ్యులు, ఉపాధి హామీ వేతనదారులను తరలించేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. సమీప ప్రాంతాల నుంచి ఉపాధిహామీ పనులు చేస్తున్న మహిళ వేతనదారులను ఆటోల్లో తరలించడం వల్ల వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement