104లో ల్యాబ్‌ టెక్నీషియన్‌ సేవలు లేనట్టేనా..! | - | Sakshi
Sakshi News home page

104లో ల్యాబ్‌ టెక్నీషియన్‌ సేవలు లేనట్టేనా..!

Mar 26 2026 7:34 AM | Updated on Mar 26 2026 7:34 AM

104లో ల్యాబ్‌ టెక్నీషియన్‌ సేవలు లేనట్టేనా..!

విజయనగరం ఫోర్ట్‌: 104 వాహనాల్లో ప్రస్తుతం అందిస్తున్న సేవలతో పాటు ల్యాబ్‌ టెక్నీషియన్‌ సేవలను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చంద్రబాబు సర్కార్‌ చెప్పింది. అందుకోసం 104 వాహనాల బాధ్యతను చూస్తున్న అరబిందో సంస్థను తప్పించి టీడీపీ నేతకు చెందిన సంస్థకు ఆ బాధ్యతను అప్పగించింది. ఆ సంస్థ బాధ్యతలు చేపట్టి పది నెలలు అవుతున్నా ఇంతవరకు 104 వాహనాల్లో ల్యాబ్‌ టెక్నీషియన్లను నియమించిన దాఖలాలు లేవు. ఇప్పటికీ ఆ సేవలు గ్రామీణ ప్రాంత ప్రజలకు అందని పరిస్థితి. దీంతో చంద్రబాబు సర్కార్‌ చెప్పిన మాటలకు చేతలకు పొంతన ఉండడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వాహనాలు గ్రామాలకు వెళ్లి బీపీ, షుగర్‌, హిమోగ్లోబిన్‌ వంటి ప్రాధమిక స్థాయి వైద్య పరీక్షలు చేసేందుకు తీసుకొచ్చారు. అదే సమయంలో ఉచితంగా పరీక్షల చేయడంతో పాటు గర్భిణులు, చిన్న పిల్లల ఆరోగ్య పరిశీలన, ఆరోగ్య అవగాహన కార్యక్రమాల నిర్వహణ వంటి సేవలు కూడా చేయాల్సి ఉంది.

నియామకం మరిచిన వైనం

104 వాహనాల నిర్వాహణను అరబిందో సంస్థను తప్పించి తర్వాత భవ్య సంస్థకు ఆ బాధ్యతను చంద్రబాబు సర్కార్‌ అప్పగించింది. జిల్లాలో 104 వాహనాలు 46 ఉన్నాయి. ఈ మేరకు 46 మంది ల్యాబ్‌ టెక్నీషియన్లను, బఫర్‌ కింద మరో నలుగురిని మొత్తంగా 50 మంది ల్యాబ్‌ టెక్నీషియన్లను నియమించాల్సి ఉంది. అయితే 104 వాహనాలను నిర్వహిస్తున్న సంస్థ బాధ్యతలు తీసుకుని పది నెలలు అవుతున్నా ఇంతవరకు నియామకాలు చేపట్టింది లేదు.

అరకొరగా వైద్య పరీక్షలు

104 వాహనాల్లో అరకొరగా వైద్య పరీక్షలతోనే సరిపెడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ల్యాబ్‌ టెక్నీషియన్లకు బదులు రోగులకు ఏఎన్‌ఎంలు, డ్రైవర్లు కూడా వైద్య పరీక్షలు చేస్తున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. బీపీ, షుగర్‌, యురిన్‌ అల్బమిన్‌, ఈసీజీ, హెచ్‌బీ సాధారణ రక్త పరీక్షలతో సరిపెడుతున్నారు. తాజా కాంట్రాక్టులో 21 పరీక్షలు నిర్వహిస్తామని చెప్పినప్పటకీ ఆ విధంగా జరగడం లేదనే విమర్శలు ఉన్నాయి.

వైద్యులు డుమ్మా..

104 వాహనాల ద్వారా ప్రతీ రోజు వాహనం వెళ్లే గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్‌ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వైద్యుడుతో పాటు సిబ్బంది అందరూ పూర్తి స్థాయిలో రోగులకు అందుబాటులో ఉండాలి. కానీ చాలా చోట్ల వైద్యులు ఇలా వచ్చి.. అలా వెళ్లిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరి కొన్నిచోట్ల మధ్యాహ్నం ఒంటి గంటకే వెళ్లిపోతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మంచానికే పరిమితం అయిన రోగుల ఇంటికి వెళ్లి వారికి వైద్య సేవలు అందించాలి. కానీ అది చాలా చోట్ల జరగడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి అక్కడ పోషకాహార లోపం ఉన్న పిల్లలను గుర్తించి వారిని పౌష్టికాహార పునరావాస కేంద్రం (ఎన్‌ఆర్‌సీ)కి పంపించాలి. ఈ కార్యక్రమం కూడా సక్రమంగా జరగడం లేదనే విమర్శలు ఉన్నాయి.

మందులు పూర్తి స్థాయిలో లేని పరిస్థితి

104 వాహనాల వద్దకు వచ్చేది పేద రోగులే. వారికి పూర్తి స్థాయిలో మందులు ఇవ్వడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. గాయాలకు ఉపయోగించే పెరిమిథ్రాన్‌, ముప్రోసిన్‌ ఆయింట్‌ మెంట్‌లు, బీపీకి ఉపయోగించే ఎమ్లాడోఫిన్‌, టెల్మస్టారన్‌ మాత్రలు, కడుపులో నొప్పికి ఉపయోగించే మెట్రోనిడజోల్‌ మాత్రలు, సిరప్‌లు, దగ్గుకు ఉపయోగించే అంబ్రాక్సోల్‌ సిరప్‌లు కొరత ఉన్నట్టు తెలిసింది.

104లో సేవలు ప్రారంభిస్తామని చెప్పిన చంద్రబాబు సర్కార్‌

టీడీపీ అధికారం చేపట్టి రెండేళ్లు

అవుతున్నా ప్రారంభించని వైనం

జిల్లాలో 104 వాహనాలు 46

ఫ్యామిలీ డాక్టర్‌ శిబిరాలకు వైద్యులు డుమ్మా కొడుతున్నారనే ఆరోపణలు

ల్యాబ్‌ టెక్నీషియన్లు లేరు..

104 వాహనాల్లో ల్యాబ్‌ టెక్నీషియన్ల ప్రస్తుతం లేరు. మందులు కొరత ఉన్నట్టు నా దృష్టికి రాలేదు. మందులు కొరత ఉన్నట్టయితే మా సిబ్బంది చెబుతారు. ఎక్కడైనా మందులు కొరత ఉంటే సమీపంలో ఉన్న పీహెచ్‌సీ, విలేజ్‌ క్లినిక్‌ దగ్గర తీసుకువస్తాం.

– కె.శ్రీకాంత్‌, 104 జిల్లా మేనేజర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement