పార్వతీపురం రూరల్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పెన్షన్ బిల్లులకు వ్యతిరేకంగా పార్వతీపురం జిల్లాలో విశ్రాంత ఉద్యోగులు నిరసన గళం వినిపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు బుధవారం జిల్లా వ్యాప్తంగా పెన్షనర్లు నల్ల బాడ్జీలు ధరించి తమ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా నాయకులు ప్రసాద్ మాట్లాడుతూ.. కేంద్రం ప్రతిపాదించిన కొత్త పెన్షన్ విధానాలు విశ్రాంత ఉద్యోగుల ఆర్థిక భద్రతపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. జీవిత చరమాంకంలో ఆసరాగా ఉండాల్సిన పెన్షన్ విషయంలో ఉద్యోగుల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా చూడాలని కోరారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్‌కు విన్నవించినట్టుఆయన వివరించారు.


