ఇంటివద్ద తండ్రి మృతదేహం..
వీరఘట్టం: మండలంలోని నీలానగరం గ్రామంలో గ్రీన్ అంబాసిడర్‌గా పనిచేస్తున్న కురమాన సూర్యనారాయణ అనారోగ్యంతో మంగళవారం రాత్రి శ్రీకాకుళం రిమ్స్‌లో చనిపోయారు. తండ్రి మరణవార్త విని పదోతరగతి పరీక్షలు రాస్తున్న కుమార్తె ఇందుమతి కన్నీరుపెట్టింది. తండ్రి మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి బుధవారం ఉదయం ఇంటికి తీసుకొచ్చారు. తనను అల్లారుముద్దుగా పెంచిన తండ్రి ఇకలేరని తెలిసి గుండెలవిసేలా రోదించింది. ఉదయం 9.30 గంటలకు టెన్త్ ఫిజికల్‌సైన్స్ పరీక్ష రాయాల్సి ఉంది. తండ్రి శవం ఇంటి వద్ద ఉంచుకుని పరీక్షక్షకు ఎలా వెళ్లేదంటూ విలపించింది. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుంటే అందరికంటే ముందు మీ నాన్నే సంతోషిస్తారని, ఆయన ఆత్మకు శాంతి కలగాలంటే పరీక్ష రాయాలి తల్లీ అంటూ బంధువులు బాలికకు నచ్చజెప్పి పరీక్షకు పంపించారు. పుట్టెడు దుఃఖంలో ఇందుమతి పరీక్షకు హాజరుకాగా, తండ్రి మృతదేహాన్ని బంధువులు ఖననం చేశారు.


