నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు
విజయనగరం అర్బన్: జిల్లాలో ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ మరియు థియరీ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు ఆదివారం నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు డీవీఈఓ ఎస్.తవిటినాయుడు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలకు జిల్లాలో మొత్తం 15,370 మంది విద్యార్థులు హాజరు కానున్నట్టు తెలిపారు. జిల్లాలో 98 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రానికి ఒక చీఫ్ సూపరిండెంట్‌తో పాటు సంబంధిత ప్రాక్టీకల్ ఎగ్జామినర్లను నియమించామని వెల్లడించారు. పరీక్షల పర్యవేక్షణ కోసం రెండు ఫ్లయింగ్ స్క్వాడ్లను కూడా నియమించినట్టు తెలిపారు. ఇంటర్మీడియెట్ థియరీ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 18వ తేదీ వరకు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ పరీక్షలకు జిల్లాలో మొత్తం 39,037 మంది విద్యార్థులు హాజరు కానున్నట్టు వెల్లడించారు. మొదటి సంవత్సరం మొత్తం 19,759 మందిలో జనరల్ 17,421 మంది, ఒకేషనల్ 2,334 మంది ఉన్నారు. రెండవ సంవత్సరం మొత్తం 19,278 మందిలో జనరల్ 16,811 మంది, ఓకేషనల్ 2,467 మంది ఉన్నారు. ఇందుకోసం జిల్లాలో 66 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షల్లో అవకతవకలకు తావులేకుండా ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటి నిఘాలోనే పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణలో కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి కమిషనర్‌గా వ్యవహరించనున్నారు.


