మహిళా స్వయం సహాయ సంఘాల అభ్యున్నతికి కృషి
విజయనగరం టౌన్: దీనదయాల్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌లోని ఉప పథకం కింద అజీవిక గ్రామీణ ఎక్స్‌ప్రెస్ యోజన పథకం అమలవుతుందని, గ్రామీణ ప్రాంతాలలో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు జీవనోపాధి కల్పించడం జరుగుతుందని డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్ పాణి పేర్కొన్నారు. స్థానిక టీటీడీసీలో ఉన్న కార్యాలయం ఆవరణలో లబ్దిదారులకు, సంఘ ప్రతినిధులకు దీనిపై శనివారం అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రాంతాలలో రవాణా సౌకర్యాలను మెరుగుపర్చడం, ఎస్‌హెచ్‌జీ సభ్యులు తమ ఉత్పత్తులను పట్టణ మార్కెట్లకు తరలించడానికి సహాయపడటం పాఠశాలలు, ఆస్పత్రులు, ఇతర ప్రజా సేవలను మారుమూల గ్రామాల ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. సెర్ప్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ శ్రీనివాసరెడ్డి, భాస్కరరావు, జిల్లా సమైఖ్య అధ్యక్షురాలు మాధవి, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన డీపీఎంలు, ఏపీఎంలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
‘ఏకలవ్య’లో విద్యార్థుల మధ్య ఘర్షణ
గుమ్మలక్ష్మీపురం: స్థానిక ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల మధ్య చెలరేగిన ఘర్షణలో ఓ విద్యార్థి తలకు తీవ్రమైన గాయమైంది. పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థి ధనుష్ కార్తీక్‌ను అదే తరగతికి చెందిన మరో విద్యార్థి మణికంఠ గాయపరిచాడు. పాఠశాల ఉపాధ్యాయులు, ఎల్విన్‌పేట పోలీసులు తెలిపిన వివరాలు.. శనివారం ఉదయం ముందస్తుగానే తరగతి గదిలోకి వెళ్లిన వీరిద్దరు క్రికెట్ బంతి కోసం వాదులాడుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ తిట్టుకుంటూ ఒకరిపై ఒకరు పుస్తకాలు విసురుకున్నారు. ఆగ్రహించిన మణికంఠ తన దగ్గరున్న అట్టను విసిరేయడంతో ధనుష్‌కార్తీక్ తలకు గాయమైంది. సమాచారం తెలుసుకున్న ఉపాధ్యాయులు భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి కార్తీక్‌ను తీసుకువెళ్లారు. ఇదిలా ఉండగా వారం కిందట ఇదే పాఠశాలకు చెందిన ఓ విద్యార్థి కూర్చునే చోట మరో విద్యార్థి పెన్ను పెట్టడంతో ప్రైవేటు భాగంలో గుచ్చుకొని ఆస్పత్రిలో చేరి చికిత్స పొందిన సంఘటన కూడా చోటు చేసుకుంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
మహిళా స్వయం సహాయ సంఘాల అభ్యున్నతికి కృషి


