ఎలక్ట్రిక్ బగ్గీ విరాళం
విజయనగరం రూరల్: జేఎన్‌టీయూ, గురజాడ విజయనగరం విశ్వవిద్యాలయానికి శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన ఆదిత్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆండ్ మేనేజ్‌మెంట్ (ఏఐటీఏఎం) కళాశాల మంగళవారం ఎలక్ట్రిక్ బగ్గీని విరాళంగా అందజేసింది. ఈ సందర్భంగా జేఎన్‌టీయూ జీవీ ప్రాంగణంలో ఉపకులపతి వీవీ సుబ్బారావు బగ్గీని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ బగ్గీ విద్యార్థులకు, బోధన, బోధనేతర సిబ్బందికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ ఎలక్ట్రిక్ బగ్గీ అందించిన ఏఐటీఎఎం యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతూ, బగ్గీ రూపొందించడానికి కృషి చేసిన ఏఐటీఏఎం విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు ఇటువంటి నూతన ఆవిష్కరణలు చేపట్టి సమాజానికి, దేశానికి ఉపయోగపడాలని పిలుపునిచ్చారు. ఇటువంటి నూతన ఆవిష్కరణలు చేపట్టి మిగిలిన విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. విద్యార్థులు రూపొందించిన బగ్గీని జేఎన్‌టీయూ జీవీ ఉపకులపతి సుబ్బారావు స్వయంగా నడిపారు. ఈ బగ్గీలో రిజిస్ట్రార్ జి.జయసుమ, ఏఐటీఎఎం డైరెక్టర్ వి.వి.నాగేశ్వరరావు, విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు బి.రాజేష్ ప్రయాణించారు. కార్యక్రమంలో జేఎన్‌టీయూ జీవీ అధికారులు, బోధన, బోధనేతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


