సమాచార హక్కు చట్టంపై అవగాహన అవసరం
● గురుకులాల జిల్లా సమన్వయకర్త
చీపురుపల్లి: సమాజంలో ప్రతి అంశంలోనూ పారదర్శకతే లక్ష్యంగా ఏర్పడిన సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాలలు, పాఠశాలల జిల్లా సమన్వయకర్త ఎం.మాణిక్యం అన్నారు. చీపురుల్లి పట్టణంలోని బీఆర్ అంబేడ్కర్ గురుకుల బాలికల కళాశాలలో మంగళవారం విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలు/కళాశాలల్లో పని చేస్తున్న ప్రిన్సిపాళ్లు, బోధనేతర సిబ్బందికి సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో ఆమె మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం వచ్చాక వ్యవస్థల్లో పారదర్శకత పెరిగిందన్నారు. గురుకుల కళాశాలలు, పాఠశాలల్లో పనిచేస్తున్న సిబ్బంది చట్టంపై పూర్తిస్థాయిలో పరిజ్ఞానం పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో స్థానిక గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ ఎ.రాణీశ్రీ పాల్గొన్నారు.
పీడీఎస్ బియ్యం పట్టివేత
సంతకవిటి: మండలంలోని మల్లయ్యపేట గ్రామంలో సోమవారం సాయంత్రం 980 కేజీల పీడీఎస్ బియ్యాన్ని విజిలెన్స్ ఎస్సై బి.రామారావు పట్టుకున్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మూల కృష్ణమూర్తి అక్రమంగా పీడీఎస్ బియ్యం నిల్వ చేసినట్లు సమాచారం అందడంతో దాడి చేసి స్వాధీనం చేసుకుని స్థానిక డీలర్‌కు అందజేశారు. పట్టుకున్న బియ్యం విలువ దాదాపు రూ.44,500 అని విజిలెన్స్ ఎస్సై బి.రామారావు తెలిపారు.
రోడ్డు ప్రమాద మృతుడి గుర్తింపు
విజయనగరం క్రైమ్: పట్టణ సమీప ధర్మపురిలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుడిని గుర్ల మండలానికి చెందిన పిన్నింటి రాంబాబుగా పోలీసులు మంగళవారం గుర్తించారు. ఎంవీజీఆర్ కాలేజీవద్ద రాడ్ బైండింగ్ షాప్‌లో పని చేస్తున్న ధర్మపురికి చెందిన ముగ్గురు వ్యక్తులు ధర్మపురం నుంచి బైక్‌పై విజయనగరం వస్తుండగా విజయనగరం నుంచి ధర్మపురికి జావా బైక్‌పై వస్తున్న వ్యక్తి ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై హాస్పిటల్‌కు తీసుకువెళ్తుండగా రాంబాబు మృతిచెందాడని ఈ మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సీఐ లక్ష్మణరావు తెలిపారు. మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగించామన్నారు.
ఆన్‌లైన్‌లో బాలల ఆరోగ్య వివరాలు
పార్వతీపురం రూరల్: బాలల ఆరోగ్య వివరాలు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని రాష్ట్ర ఐటీ కన్సల్టెంట్ జి.శ్రీనివాసరావు ఆదేశించారు. మండలంలోని జగన్నాథపురం యూపీహెచ్‌సీ సహా అక్కడి అంగన్‌వాడీ కేంద్రాలు, జోగింపేట వసతిగృహాన్ని మంగళవారం సందర్శించిన ఆయన పలు సూచనలు చేశారు. రాష్ట్రీయ బాలల స్వాస్థ్య కార్యక్రమం ద్వారా చిన్నారులకు నిర్వహిస్తున్న ఆరోగ్య పరీక్షల నివేదికలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని, దేశ భవిష్యత్ చిన్నారుల చేతుల్లోనే ఉందని, అటువంటి వారి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఆయన వెంట జిల్లా అధికారి జగన్మోహనరావు తదితరులు ఉన్నారు.
ఉద్యోగ భద్రత కల్పించాలి
సీతానగరం: తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని పీఏసీఎస్(ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం) ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయమై వారు మండల కేంద్రంలోని డీసీసీబీ వద్ద మండల జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నాకు దిగారు. జీవో నంబర్ 36 వెంటనే అమలు చేయాలని, ఉద్యోగులకు రూ.5 లక్షలకు తక్కువ లేకుండా ఆరోగ్య బీమా పథకం అమలు చేయాలని, ప్రతి ఉద్యోగికి సంబంధించి రూ.20 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ చేయించి, వారి కుటుంబాలకు అందజేయాలన్నారు. ఎప్పటి జీతాలు అప్పుడే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.
సమాచార హక్కు చట్టంపై అవగాహన అవసరం
సమాచార హక్కు చట్టంపై అవగాహన అవసరం
సమాచార హక్కు చట్టంపై అవగాహన అవసరం


