బరోడా, పంజాబ్ జట్ల విజయం
విజయనగరం రూరల్: బీసీసీఐ ఆధ్వర్యంలో జరుగుతున్న అండర్–15 మహిళల వన్డే టోర్నీలో (ఎలైట్ గ్రూప్) బరోడా, పంజాబ్ జట్లు విజయం దుందుభి మోగించాయి. స్థానిక విజ్జి క్రికెట్ మైదానంలో బరోడా, హైదరాబాద్ జట్ల మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌లో బరోడా జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించి నిర్ణీత 35 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు సాధించింది. హైదరాబాద్ జట్టు ఓపెనింగ్ బ్యాటర్లు పి.శాన్వి (44 పరుగులు), భవిష్యరెడ్డి (41 పరుగులు) తొలి వికెట్‌కు 16 ఓవర్లలో 80 పరుగులు భాగస్వామ్యం అందించారు. అయితే మిగతా బ్యాటర్లు విఫలమవడంతో స్వల్ప స్కోర్‌కే పరిమితమవుతుంది. అనంతరం 138 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బరోడా జట్టు 24.2 ఓవర్లలో కేవలం ఒక వికెట్ నష్టపోయి 141 పరుగులు చేసి విజయం సాధించింది.
27 పరుగుల తేడాతో పంజాబ్ విజయం
డెంకాడ మండలంలోని చింతలవలసలో గల డాక్టర్ పీవీజీ రాజు ఏసీఏ స్పోర్ట్స్ కాంప్లెక్స్ క్రికెట్ మైదానంలో పంజాబ్, విదర్భ జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో పంజాబ్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ జట్టు నిర్ణీత 35 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 166 పరుగులు సాధించింది. అనంతరం 167 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన విదర్భ జట్టు 33.1 ఓవర్లలో 139 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ పంజాబ్ బౌలర్లలో కౌర్ సంధూ 3 వికెట్లు, ఆస్తా 4 వికెట్లు సాధించి జట్టు విజయానికి కృషి చేశారు.
బరోడా, పంజాబ్ జట్ల విజయం


