రెండు కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్
● జిల్లాకేంద్రంలోని ఎత్తు బ్రిడ్జిపై ప్రమాదం
● మినీవ్యాన్‌ను ఢీకొన్న బైక్
● బోల్తాపడిన వ్యాన్
విజయనగరం క్రైమ్: స్థానిక ఎత్తు బ్రిడ్జిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంతో రెండు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. కొత్తవలస నుంచి బలిజిపేటకు మట్టి పెంకులను తీసుకువెళ్తున్న మినీవ్యాన్‌ను ఎదురుగా సాలూరు నుంచి వస్తున్న బైక్ ఢీకొట్టింది. దీంతో వ్యాన్ రోడ్డు మధ్యలో బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే వ్యాన్‌ను ఢీ కొట్టిన ద్విచక్రవాహన చోదకుడు ఘటనా స్థలి నుంచి పరారయ్యాడు. ఈ నేపథ్యంలో సాలూరు రోడ్డు నుంచి విజయనగరం వస్తున్న హైవే మొత్తం వాహనాలు ఆగిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో రెండు గంటల పాటు ఎత్తు బ్రిడ్జి ప్రాంతంలో వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. ఈ సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులు, సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ప్రమాదంలో గాయాల పాలైన మినీ వ్యాన్ డ్రైవర్ గోపీని చికిత్స నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ ప్రాణాపాయం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


