పంట మార్పిడి విధానంతో ప్రయోజనాలు
● జిల్లా వ్యవసాయ అధికారిణి
అన్నపూర్ణ
కురుపాం: పంట మార్పిడి విధానంతో రైతులకు పలు ప్రయోజయనాలు కలుగుతాయని జిల్లా వ్యవసాయాధికారిణి రెడ్డి అన్నపూర్ణ అన్నారు. ఈ మేరకు కురుపాం మండలంలోని దురిబిలి గ్రామంలో ఖరీఫ్‌లో వరి పంట తరువాత పంట మార్పిడి విధానంలో భాగంగా రబీలో ప్రధాన పంట మినుముతో పాటు పెసలు, వేరుశనగ, నువ్వులు, పొద్దు తిరుగుడు, కూరగాయలు, ఆకుకూరలు, తదితర 12 రకాల పంటలు సాగు చేస్తున్న రైతుల క్షేత్రాలను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పంట మార్పిడి విధానం రైతులు పాటించడం వల్ల భూమి సారవంతం చెందుతుందని, పంటలకు పురుగులు, తెగుళ్లు తట్టుకునే సామర్థ్యం కలిగి, అధిక దిగుబడులు సాధించే అవకాశం కలుగుతుందన్నారు. మొక్కలలో జీవవైవిద్యం పెంపొందుతుందని చెప్పారు. మండల వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు మాట్లాడుతూ నేల చిన్న పదును ఉన్నా ఏదో ఒక పంట వేస్తే మధ్యలో వర్షం చిన్నగా పడినా, లేదా మంచు ద్వారా పంట ఎంతో కొంత వస్తుందని, భూమి ఖాలీగా ఉండకుండా చూసుకోవాలని అందరూ రైతులు తమకున్న పూర్తిస్థాయి విస్తీర్ణంలో పంట సాగు చేసుకోవచ్చునన్నారు. కార్యక్రమంలో ఏఈఓ భార్గవ్, మాస్టర్ ట్రైనర్ బి.శ్రీరామ్, సత్యం, రైతులు పాల్గొన్నారు.


