అర్జీదారులకు నిరాశ
● పీజీఆర్‌ఎస్‌లో మంత్రి పాల్గొన్నా అర్జీదారులకు దక్కని మాట్లాడే
అవకాశం
విజయనగరం అర్బన్: కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో అర్జీదారులకు నిరాశే ఎదురైంది. కార్యక్రమంలో రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్వయంగా పాల్గొన్నప్పటికీ అర్జీదారులు మంత్రితో నేరుగా మాట్లాడి సమస్యలు చెప్పుకునే అవకాశం దక్కకపోవడంతో నిరాశ వ్యక్తం చేశారు. మంత్రితోపాటు కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ సహా పదుల సంఖ్యలో జిల్లా అధికారులు ఒకే వేదికపై పాల్గొని తమ అర్జీలను తీసుకుంటున్నారని, మంత్రికి నేరుగా చెప్పుకోవడానికి అవకాశం లభించలేదని అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రిని ఎలాగైనా కలవాలనుకునే కొందరు కారు దగ్గర నిరీక్షించి సమస్యలు చెప్పుకున్నారు.
297 వినతుల స్వీకరణ
పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో మొత్తం 297 వినతులు స్వీకరించగా వాటిలో అత్యధికంగా 149 వినతులు ఒక్క రెవెన్యూ శాఖకు చెందినవే ఉన్నాయి. డీఆర్‌డీఏ64, పంచాయతీ రాజ్ శాఖ22, మున్సిపల్ పరిపాలన2, విద్యుత్ శాఖ4, గృహ నిర్మాణ శాఖ2, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ8, డీసీహెచ్‌ఎస్1, విద్యాశాఖ3, ఇతర శాఖలు 42 అర్జీలు ఉన్నాయి. అయితే మంత్రి పాల్గొన్న నేపధ్యంలో స్వీకరించిన ఈ వినతుల పరిష్కారంలో ఎలాంటి కొత్త చర్యలు గానీ, తక్షణ పరిష్కారాలుగానీ జరగలేదు. గతంలో జరిగిన కార్యక్రమాల్లోలాగానే సాధారణ ఆదేశాలతోనే పరిమితమైందని అర్జీదారులు విమర్శించారు.
పీజీఆర్‌ఎస్‌కు స్పందన
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలకు ప్రజల నుంచి స్పందన లభిస్తోందని, వినతులను సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అయితే ఇలాంటి ఆదేశాలు గత కార్యక్రమాల్లోనూ ఇచ్చినవే అని అమలులో ఎలాంటి పురోగతి లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వినతులు త్వరగా పరిష్కరించాలి
కలెక్టర్ ఎస్‌రాంసుందర్‌రెడ్డి మాట్లాడుతూ వినతులను త్వరితగతిన పరిష్కరించాలని ఆలస్యం చేస్తే సహించేది లేదని ప్రతి వారం సమీక్ష చేస్తామని తెలిపారు. అధికారులు అర్జీదారులతో మాట్లాడిన తేదీ, సమయాన్ని రిపోర్టులో నమోదు చేయాలని టోల్ ఫ్రీ నంబర్ 1100కు వచ్చిన కాల్స్‌కు సరైన స్పందన అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, జిల్లా రెవెన్యూ అధికారి మురళి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు డి.వెంకటేశ్వరరావు, రాజేశ్వరి, ప్రమీల గాంధీ, బి.శాంతి, సర్వే శాఖ ఎ.డి ఆర్.విజయకుమార్, డీఈఓ మాణిక్యం నాయుడు, వ్యవసాయ శాఖ జేడీ, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ అన్నపూర్ణమ్మ, బీసీ సంక్షేమ అధికారిణి జ్యోతిశ్రీ, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్ పంచాయతీరాజ్ ఎస్‌ఈ, ఆర్‌డబ్ల్యూస్ ఎస్‌ఈ, ఆర్‌అండ్ బీఎస్‌ఈ, వివిధ శాఖల జిల్లా అధికారులు, విజయనగరం, బొబ్బిలి, చీపురుపల్లి ఆర్‌డీఓలు, అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.
ఎస్పీ పీజీఆర్‌ఎస్‌కు 31 ఫిర్యాదులు
విజయనగరం క్రైమ్: స్థానిక డీపీఓలోని కాన్ఫరెన్స్ హాలులో ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం సోమవారం జరిగింది. ఎస్పీ దామోదర్ తన చాంబర్‌లోనే ఫిర్యాదుదారుల నుంచి విజ్ఙాపనలను స్వీకరించారు. ఏఎస్పీ సౌమ్యలత డీపీఓలోని కాన్ఫరెన్స్ హాలులో ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో మొత్తం 31 ఫిర్యాదులను స్వీకరించగా అందులో భూతగాదాలకు సంబంధించి 10, కుటుంబ కలహాలకు సంబంధించి 3, మోసాలకు సంబంధించి 3 నగదు వ్యవహారాలకు సంబంధించి 2, ఇతర అంశాలకు సంబంధించినవి 13 ఫిర్యాదులు వచ్చాయి. సంబంధిత సిబ్బంది ఫిర్యాదు అంశాలను పరిశీలించాలని ఎస్పీ ఆదేశంచారు. వాటి పూర్వాపరాలపై విచారణ జరిపి, ఫిర్యాదు అంశాల్లో వాస్తవాలను గుర్తించి చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐలు ఏవీ లీలారావు, ఎస్సైలు రాజేష్, ప్రభావతి, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.
అర్జీదారులకు నిరాశ


