అర్జీలు పునరావృతం కాకూడదు: కలెక్టర్ ప్రభాకరరెడ్డి
పార్వతీపురం: ప్రజాసమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)కు అందిన అర్జీలపై సత్వరమే చర్యలు చేపట్టాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావేదికకు 117 వినతులు అందాయి. ఇందులో 39 రెవెన్యూ,79 వివిధ సమస్యలకు సంబంధించినవి ఉన్నాయి. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పీజీఆర్‌ఎస్ అర్జీలపై ఆడిటింగ్ జరుగుతుందన్నారు. జిల్లా అధికారులు ఆయా వినతులను స్వయంగా పరిశీలించి సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అర్జీ పునరావృతం కారాదన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాధ్, డీఆర్‌ఓ కె.హేమలత, ఎస్‌డీసీ పి.ధర్మచంద్రారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ ఎం.సుధారాణి తదితరులు పాల్గొన్నారు.
అర్జీల్లో కొన్ని ఇలా..
● జియ్యమ్మవలస పంచాయితీలో ప్రత్యేక నిధులతో కాలువలను శుభ్రం చేసినట్లు, గ్రీన్ అంబాసిడర్‌లకు 24 నెలల జీతం చెల్లించినట్లు తప్పుడు నివేదికలను ఎంపీడీవో చూపించి నిధులు దుర్వినియోగం చేశారని తక్షణమే దర్యాప్తు చేపట్టాలని కోరుతూ ఏఎంసీ డైరెక్టర్ ఎల్.తాతబాబు దరఖాస్తు చేశారు.
● పార్వతీపురం పట్టణానికి చెందిన పి.గౌరీశంకరరావు చనిపోగా వితంతు పింఛన్ మంజూరు చేయాలని పి.రజని కోరారు.
● పొట్ట కేన్సర్‌తో బాధ పడుతూ, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని చికిత్సకు అవసరమైన సాయం మంజూరు చేయాలని బలిజిపేట మండలం పెదపెంకి గ్రామానికి చెందిన ఎన్.నర్సింగరావు దరఖాస్తు అందజేశాడు.
ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్
పార్వతీపురం రూరల్: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి బాధితుల నుంచి స్వయంగా ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదు దారులు తమ సమస్యలను ఎస్పీకి విన్నవించారు. ఈ వారం కార్యక్రమంలో కుటుంబకలహాలు, సైబర్ మోసాలు, భూ వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీల వేధింపులు, ఆన్‌లైన్ మోసాలకు సంబంధించి 3 ఫిర్యాదులు అందాయి. బాధితులతో మాట్లాడిన ఎస్పీ, వారి సమస్యల తీవ్రతను బట్టి సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధితులు అందజేసిన ఫిర్యాదులను క్షుణ్ణంగా విచారించి, వాస్తవాల ఆధారంగా చట్టపరిధిలో తక్షణ చర్యలు తీసుకోవాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. తీసుకున్న చర్యలపై నివేదికను జిల్లా కార్యాలయానికి పంపాలని సూచించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ ఆదాం, ఎస్సై రమేష్ నాయుడు, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.
ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌కు 10 అర్జీలు
సీతంపేట: స్థానిక ఐటీడీఏలోని ఎస్‌ఆర్‌శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు 10 వినతులు వచ్చాయి. చిన్నబగ్గ ఆశ్రమ పాఠశాలలో స్వీపర్, వాచ్‌మన్ పోస్టు ఇప్పించాలని గ్రామానికి చెందిన వి.బాజన్న కోరాడు. కిరాణా షాపు పెట్టుకోవడానికి రుణం మంజూరు చేయాలని బుతలగూడకు చెందిన అప్పలమ్మ కోరింది. బైదలాపురం పీహెచ్‌సీలో నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదు చేసినందుకు బెదిరిస్తున్నారని మువ్వల అచ్చమ్మ వాపోయింది. సరడాం ఎంపీపీ స్కూల్‌కు అదనపు భవనం మంజూరు చేయాలని సవర బాలరాజు వినతిపత్రం అందజేశాడు. కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ ఈఈ రమాదేవి, పీహెచ్‌వో ఎస్.వి.గణేష్, వ్యవసాయాధికారిణి వాహిని తదితరులు పాల్గొన్నారు.
అర్జీలు పునరావృతం కాకూడదు: కలెక్టర్ ప్రభాకరరెడ్డి
అర్జీలు పునరావృతం కాకూడదు: కలెక్టర్ ప్రభాకరరెడ్డి


