వందేళ్ల పోరాట చరిత్ర సీపీఐదే
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల
ఈశ్వరయ్య
విజయనగరం గంటస్తంభం: చరిత్ర పరిశీలిస్తే దేశానికి ఎవరు సేవ చేశారో స్పష్టంగా తెలుస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. స్వాతంత్య్ర ఉద్యమం నుంచి ప్రజాహక్కుల పోరాటాల వరకూ వందేళ్లకు పైగా సీపీఐ కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ఈనెల 18న ఖమ్మం పట్టణంలో జరిగే సీపీఐ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే నిమిత్తం స్థానిక అమర్ భవన్‌లో సోమవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కార్యదర్మి ఒమ్మి రమణ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్వాతంత్య్ర ఉద్యమంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ముందుండి పోరాడింది కమ్యూనిస్టులేనని గుర్తు చేశారు. దేశాన్ని పాలిస్తున్న బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ విధానాలు కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా ఉన్నాయని విమర్శించారు. ఎర్రజెండా పట్టుకున్న ప్రతి కార్యకర్త ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువల రక్షణకు కట్టుబడి ఉంటారన్నారు. వందేళ్ల ఉద్యమ చరిత్రలో భూ పోరాటాలు, ప్రజా ఉద్యమాల ద్వారా పేదలకు న్యాయం జరిగిందని తెలిపారు. మహిళల రక్షణ విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రస్తావించారు. అంతకుముందు పట్టణంలోని మయూరి కూడలి నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ మీదగా సీపీఐ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎర్రజెండాలతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.కామేశ్వరరావు, సహాయ కార్యదర్శి బుగత అశోక్, అలమండ ఆనందరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు, ప్రజాసంఘాల నాయకులు, మహిళలు, ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు, కార్మికులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
వందేళ్ల పోరాట చరిత్ర సీపీఐదే


