దాడి చేసిన వ్యక్తులపై చర్యలు
● ఎస్పీ దామోదర్
భోగాపురం: దళితులపై దాడి చేసిన వ్యక్తులపై విచారణ చేపడుతున్నామని నేరం రుజువైతే వెంటనే వారిపై కేసులు నమోదు చేసి తగు చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. ఈ మేరకు మండలంలోని ముంజేరు పంచాయతీ, సిద్ధార్థ్‌నగర్ కాలనీ చెందిన దళితులు తమపై దాడిచేసి దౌర్జన్యంగా తమ కాలనీ మీదుగా మురుగుకాలువ నిర్మించిన ముంజేరు వాసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గడిచిన 30 రోజులుగా ఎంపీడీవో కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షకు దిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఎస్పీ దామోదర్, సీఐ కె దుర్గాప్రసాద్, ఎస్సైలు వి.పాపారావు, సూర్యకుమారిలు సోమవారం దీక్ష శిబిరం వద్దకు చేరుకుని, దీక్ష చేస్తున్న దళితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ దామోదర్ దళితులతో మాట్లాడుతూ మీపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోనున్నామని చెప్పారు. మీరంతా ఫిర్యాదు ఇవ్వడంతో విచారణ జరిపి 35 మందిపై కేసులు నమోదు చేసి నోటీసులు కూడా ఇచ్చి కోర్టులో హాజరు పరిచామని చెప్పారు. తదుపరి కోర్టు అదేశాల మేరకు వారిపై చర్యలు తీసుకుంటామని, దీక్ష విరమించుకోవాలని దళితులను కోరారు. అనంతరం ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ మండలంలో ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను పరిశీలించి ప్రమాదాల నియంత్రణకు తగు చర్యలు చేపట్టాలని సిబ్బందిని అదేశించినట్లు తెలిపారు. త్వరలో ఈ ప్రాంతంలో విమానాశ్రయం ప్రారంభం కానున్న నేపథ్యంలో నేరాలు, రోడ్డు ప్రమాదాల నియంత్రణపై దృష్టి పెడుతున్నామన్నారు. సిబ్బందిని ఎక్కడెక్కడ ఏవిధంగా సర్దుబాటు చేయాలనే విషయాలపై ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.


