లబ్ధిదారుల రుణాలకు వడ్డీ మాఫీ
● జిల్లాలో 113 మందికి లబ్ధి
● జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంస్థ కార్యనిర్వాహక సంచాలకుడు డి.వెంకటేశ్వరరావు
పార్వతీపురంటౌన్: జిల్లాలో ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ, ఎన్‌ఎస్‌కేఎఫ్‌డీసీ ద్వారా లబ్ధిదారులు పొందిన రుణాలకు వడ్డీని మాఫీ చేస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంస్థ కార్యనిర్వాహక సంచాలకుడు డి.వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ వడ్డీ మాఫీతో జిల్లాలో ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ పథకం కింద రుణం పొందిన 47 మందికి రూ.14.23 లక్షల వడ్డీ, ఎన్‌ఎస్‌కేఎఫ్‌డీసీ పథకం కింద రుణం పొందిన 66 మందికి రూ.19.32 లక్షలు వడ్డీ మాఫీ కానున్నట్లు చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వం 31.12.25దీన విడుదల చేసిందని తెలిపారు. అయితే ఈ పధకం కింద వడ్డీ మాఫీ పొందేందుకు బకాయి పడిన అసలు మొత్తాన్ని నాలుగు నెలలలోగా పూర్తిగా జిల్లా షెడ్యూల్డ్ కులాల సేవా సహకార సంస్థ, విజయనగరం వారికి చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఆ విధంగా చెల్లించిన వారికి మాత్రమే వడ్డీ మాఫీ వర్తిస్తుందని, ప్రభుత్వం ఇచ్చిన ఈ అద్భుత అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ప్రకటనలో కోరారు.


