సేవలకు సలాం
సాలూరు: వారంతా అమాయక పేద, మధ్య తరగతికి చెందిన ప్రజలు. చాలామంది నిరక్షరాస్యులు, వృద్ధులే. అనారోగ్యాలతో ఆస్పత్రులకు వచ్చే రోగులు, వారి కుటుంబసభ్యులకు ఆస్పత్రిలో చేరేందుకు ఎక్కడికి వెళ్లాలి? వైద్యపరీక్షల కోసం ఆస్పత్రిలో ఏ విభాగానికి ఏ వైపు గదులకు వెళ్లాలో తెలియని అయోమయ పరిస్థితి. ఇలా అవస్థలు పడుతున్న వారి గురించి ఆలోచించి, కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర్‌రెడ్డి శ్రీకారం చుట్టిన మరో నూతన కార్యక్రమమే హెల్పింగ్ హ్యాండ్స్. ఆస్పత్రుల్లో సేవలందించేందుకు విద్యార్థులు, యువత, సేవా సంస్థల సభ్యులు తదితరులు స్వచ్ఛందంగా ముందుకురావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. గతేడాది డిసెంబరు 16న కలెక్టర్ ట్రయల్ రన్ ప్రారంభించిన ఈ కార్యక్రమం సాలూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో విజయవంతంగా నడుస్తోంది. సేవాభావంతో ముందుకు వస్తున్న వలంటీర్లు, స్వచ్ఛంద సేవాసంస్థల సభ్యులు ఆస్పత్రిలో ఇప్పటివరకు 82 మంది నమోదయ్యారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో మంగళవారం హెల్పింగ్ హ్యాండ్స్ కార్యక్రమాన్ని అధికారులు అధికారికంగా ప్రారంభించనున్నారు.
కలెక్టర్ ఆదేశాలు అమలుచేస్తున్న అధికారులు
కలెక్టర్ ఇచ్చిన హెల్పింగ్‌హేండ్స్ ట్రయల్ రన్ ఆదేశాలను క్షేత్రస్థాయిలో అధికారులు అమలుచేస్తుండడంతో ఈ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది. సేవాభావంతో ముందుకు వస్తున్న వలంటీర్లకు స్థానిక ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.మీనాక్షి తగు రీతిలో మార్గదర్శకం ఇస్తున్నారు.అధిక సంఖ్యలో విద్యార్థులు, సేవాసంస్థల సభ్యులు వచ్చి హెల్పింగ్‌హ్యాండ్స్‌లో తమ పేర్లను నమోదుచేసుకుంటున్నారు. వారి సేవలను విడతల వారీగా వినియోగించుకునేందుకు సూపరింటెండెంట్ డా.మీనాక్షి ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు.ఆ సభ్యులకు చార్ట్ తయారుచేసి,ఏ రోజు ఎవరు సేవలందించాలో సిద్ధం చేసి ముందుగానే తెలియచేస్తున్నారు. దీనివల్ల సభ్యులు కూడా వారికి కేటాయించిన రోజుల్లో వచ్చి రోగులకు సేవలు అందిస్తున్నారు. ఆస్పత్రిలో ఏ సేవలు ఎక్కడ లభిస్తాయో తెలియక ఇబ్బందులుపడుతున్న వారికి ఓపీ విభాగం, ఏ డాక్టర్ వద్దకు వెళ్లాలి? వైద్యపరీక్షలకు ఎక్కడికి వెళ్లాలి? తదితర అంశాల్లో తమ వంతు సాయం చేస్తున్నారు. రోగి ఆస్పత్రికి వచ్చి చికిత్స తీసుకుని మళ్లీ ఇంటికి వెళ్లేంతవరకు హెల్పింగ్‌హేండ్స్ సభ్యులు రోగికి అండగా నిలుస్తున్నారు. పట్టణ, పరిసర మండలాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల నర్సింగ్, ఒకేషనల్ విద్యార్థులు అధికంగా ఇందులో సభ్యులుగా నమోదవడం వారి సేవాభావానికి అద్దంపడుతోంది. వారి సేవలను గుర్తిస్తూ కలెక్టర్ ఆదేశాల మేరకు సర్టిఫికెట్లు త్వరలో ఇస్తామని సూపరింటెండెంట్ తెలిపారు.
కలెక్టర్ మరో నూతన కార్యక్రమం
హెల్పింగ్ హ్యాండ్స్
ఆస్పత్రుల్లో రోగులకు సేవలందించే
ట్రయల్‌రన్ విజయవంతం
అధికారికంగా కార్యక్రమం ప్రారంభం రేపు
సేవలకు సలాం


